పవన్ ఒక పుస్తకాల పురుగు
ఒక సూపర్ స్టార్ డం కలిగిన టాలీవుడ్ హీరోలో ఇంతటి సాహితీ అభిలాష ఉందా అని కూడా అనిపించింది.
By: Tupaki Desk | 3 Jan 2025 3:36 AM GMTపవన్ కళ్యాణ్ లో మరో కోణం విజయవాడ బుక్ ఫెస్టివల్ లో ఆవిష్కృతమైంది. తాను ఎంతగానో ఇష్టపడే తెలుగు రచయితలు కవుల గురించి వారి రచనల గురించి పవన్ అలవోకగా చెబుతూ ఉంటే తెలుగు సాహిత్యం పట్ల మమకారం ఉన్న వారికి ఎంతో ముచ్చట వేసింది.
ఒక సూపర్ స్టార్ డం కలిగిన టాలీవుడ్ హీరోలో ఇంతటి సాహితీ అభిలాష ఉందా అని కూడా అనిపించింది. మహాకవి శ్రీ శ్రీ రాసిన మహాప్రస్థానం, బాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి, గుర్రం జాషువా సాహిత్యం విశ్వనాధ సత్యనారాయణ గారి కవిత్వం గురించి పవన్ కళ్యాణ్ చెబుతూంటే పవన్ లోని మరో కోణం అంతా చూశారు.
ఆయన అభిమానులకు ఒక్కటే మాట చెప్పారు. తాను పుస్తకాల వల్లనే మీకు ప్రాణంగా మారాను, మీకు దగ్గరగా వచ్చాను అని. పుస్తకాలు తనకు ప్రాణం అన్నారు. ఒక కోటి రూపాయలు ఇవ్వాలంటే ఏ మాత్రం సందేహించని తాను ఒక మంచి పుస్తకం ఇవ్వమంటే మాత్రం చాలా సంకోచిస్తాను అని పవన్ చెప్పారు.
తాను చిన్నప్పటి నుంచి పుస్తకాలతోనే పెరిగాను అన్నారు. తనకు తన తల్లిదండ్రులే పుస్తకాల మీద మక్కువ కలిగేలా చేశారు అన్నారు. తాను చేతిలో డబ్బులు ఉంటే పుస్తకాలు కొనుక్కుని వాటిని మొత్తం గదిలో ఒంటరిగా కూర్చుని చదువుకోవడానికి ఇష్టపడతాను అన్నారు.
తనకు ధైర్యం ఇచ్చేది పుస్తకాలు అన్నారు. దారి చూపించేది కూడా పుస్తకాలే అన్నారు. తాను రచయితను కాకపోయినా రచయితల కవుల కష్టం ఎంతటితో గుర్తించగలను అన్నారు. వారు రాయడానికి పడే తపన హృదయ వేదన తనకు తెలుసు అన్నారు
తెలుగు బాగా చదవండి వ్యాకరణం నేర్చుకోండి తెలుగు భాష చాలా గొప్పది అని ఆయన భావి పౌరులకు సూచించారు. తెలుగు వారిగా పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం అన్నారు తెలుగు కవులు రచయితల గృహాలను వారి తిరిగిన ప్రాంతాలను గుర్తించి తెలుగు సాహితీ టూరిజానికి శ్రీకారం చుట్టే ఆలోచన ప్రభుత్వానికి ఉందని అన్నారు.
విదేశీ కవులు మరణించినా వారి ఇళ్ళు ఒక మందిరంగా అక్కడ వారు చూసుకుంటారని మన దేశంలో కూడా అలాంటి కల్చర్ రావాలని పవన్ కోరారు పుస్తకాలను అంతా చదవాలి చదివించాలని అన్నారు.సెల్ ఫోన్లలో చదవడం కాదు నిజంగా ఒక పుస్తకాన్ని పట్టుకుని చదివితే చాలు దాని లోతైన భావాలు అర్ధం అవుతాయని సృజనాత్మకత పెరుగుతుందని అన్నారు.
కొత్త ఆలోచనలు పుడతాయని సమాజాన్ని చూసే దృక్కోణం కూడా మారుతుందని పవన్ అన్నారు. మొత్తానికి పవన్ ఒక అద్భుతమైన స్పీచ్ నే ఇచ్చారు. ఆది సాహితీ ప్రియులు మాత్రమే కాదు రచయితలు కవులు మాత్రమే కాదు నేటి తల్లిదండ్రులు పిల్లలు అంతా కూడా మురిసి ముచ్చట పడేలా ఉంది. పవన్ కి ఉన్న లక్షలాది అభిమానులు ఆయనను స్పూర్తిగా తీసుకుంటే తెలుగు పుస్తకం బతుకుతుంది. తెలుగు మాట నిలుస్తుంది తెలుగు బాట ఒక వెలుగు బాట అవుతుంది.