పవన్ కుమారుడికి ప్రమాదం.. స్పందించిన జగన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం కలకలం రేపింది.
By: Tupaki Desk | 8 April 2025 8:36 AMఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం కలకలం రేపింది. ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.., మెగాస్టార్ చిరంజీవి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడని తెలియగానే పలువురు ఆందోళన చెందారు. ఈ విషయంపై వైఎస్ జగన్ కూడా వెంటనే స్పందించారు. "ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాకయ్యాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా" అని ఆయన తన X ఖాతాలో పేర్కొన్నారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. సింగపూర్ లో పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడటం ఆందోళన కలిగించిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై తాజాగా సమాచారం అందించారు. 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని ఆయన తెలిపారు. అగ్నిప్రమాదంలో శంకర్ కాళ్లకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని చిరంజీవి వెల్లడించడంతో మెగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. పవన్ భార్య అనా లెజ్నోవా సింగపూర్ లోనే ఉండి కుమారుడి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను చిరంజీవి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్, తెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. లోకేష్ మాట్లాడుతూ, ప్రమాద వార్త విని తాను షాక్ కు గురయ్యానని తెలిపారు. కేటీఆర్ కూడా ఇదే తరహాలో స్పందిస్తూ మార్క్ శంకర్ కు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు.