Begin typing your search above and press return to search.

మార్క్ శంకర్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే.. ఫొటో వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడటం కలచివేసింది.

By:  Tupaki Desk   |   9 April 2025 12:26 PM
మార్క్ శంకర్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే.. ఫొటో వైరల్
X

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడటం కలచివేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కు తమ మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేశారు.

కుమారుడిని చూసేందుకు పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కూడా సింగపూర్ చేరుకున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్క్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడం వల్ల తలెత్తే సమస్యలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం మార్క్‌ను ఎమర్జెన్సీ వార్డు నుంచి సాధారణ వార్డుకు తరలించారు. మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు పరీక్షలు కొనసాగుతాయని జనసేన వర్గాలు వెల్లడించాయి.

తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటోలో ముక్కుకు మాస్క్, చేతికి కట్లతో మార్క్ కాస్త బాధగా కనిపిస్తున్నప్పటికీ, రెండు చేతులూ చూపిస్తూ "నేను బాగానే ఉన్నాను, కంగారు పడకండి" అన్నట్లుగా ధైర్యం చెబుతున్నాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు చిన్నారిలో తండ్రి పవన్ కళ్యాణ్ ధైర్యం కనిపిస్తోందని అంటున్నారు. "నీకు ఏమీ కాదు నాన్నా, త్వరగా కోలుకో" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం మార్క్‌కు బ్రోన్కోస్కోపీ చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. బ్రోన్కోస్కోపీ అనేది ఊపిరితిత్తుల లోపలి భాగాలు, ముఖ్యంగా వాయునాళాలైన ట్రాకియా, బ్రాంకీ , బ్రాంకియోల్స్‌ను పరిశీలించేందుకు చేసే వైద్య ప్రక్రియ. దీనిని బ్రోన్కోస్కోప్ అనే ప్రత్యేకమైన కెమెరా పరికరంతో నిర్వహిస్తారు. ఊపిరితిత్తుల్లో అసాధారణంగా పెరిగిన గడ్డలు, ఫంగస్ లేదా ఇన్ఫెక్షన్లను గుర్తించడానికి, అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా ట్యూమర్‌లను నిర్ధారించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. మార్క్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో వైద్యులు ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలుస్తోంది.

మరోవైపు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాంలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ ప్రమాదం గురించి మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, సమ్మర్ క్యాంప్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తన కుమారుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని తెలిపారు. మొదట ఇది చిన్న ప్రమాదమే అనుకున్నానని, ఆ తర్వాత దాని తీవ్రత తెలిసిందని ఆయన అన్నారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే తన రెండో కుమారుడికి ఇలా జరగడం చాలా బాధాకరమని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.