Begin typing your search above and press return to search.

మోడీ సభకు పవన్ ప్రత్యేక ఆకర్షణ ?

ప్రధాని హోదాలో 2014 నుంచి నరేంద్ర మోడీ ఎన్నో సార్లు ఏపీకి వచ్చారు అధికారిక పర్యటనలు చేసి వెళ్లారు.

By:  Tupaki Desk   |   7 Jan 2025 3:50 AM GMT
మోడీ సభకు పవన్ ప్రత్యేక  ఆకర్షణ ?
X

ప్రధాని హోదాలో 2014 నుంచి నరేంద్ర మోడీ ఎన్నో సార్లు ఏపీకి వచ్చారు అధికారిక పర్యటనలు చేసి వెళ్లారు. అప్పట్లో ఏపీలో టీడీపీ కేంద్రంలోని ఎన్డీయేతో మిత్రత్వం నెరపుతూ వచ్చింది. అలా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అనేక సార్లు మోడీతో కలసి వేదికను పంచుకున్నారు

కానీ ఈసారి చాలా ప్రత్యేకం. ఎందుకంటే విశాఖలో జరిగే నరేంద్ర మోడీ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తారు. అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే వేదిక మీద ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర గవర్నర్ కేంద్ర మంత్రులకు మాత్రమే చోటు ఉంది.

అంటే చాలా పరిమితంగానే వేదిక మీద ప్రముఖులకు సీటు ఉంది అన్న మాట. ఇక ఈ సభలో ముగ్గురే వక్తలు మాట్లాడుతారు. అందులో చంద్రబాబు పవన్ కళ్యాణ్, మోడీ ఉంటారు. ఈ విధంగానే కార్యక్రమం రూపకల్పన చేశారు.

ప్రధాని సభలో ఆయనతో వేదికను సరిసమానంగా పంచుకుంటూ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ప్రసంగం చేయడం ఇదే ప్రధమం అని చెప్పాలి. అంతే కాదు ఆయన ఈ విధంగా ఈసారి సభలో హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మోడీ అయితే ఢిల్లీలో ఏడు నెలల క్రితం జరిగిన ఎన్డీయే సమావేశంలో పవన్ ని తుఫాను అని అభివర్ణించారు. ఆ తరువాత హర్యానాలో రెండు నెలల క్రితం జరిగిన ఎన్డీయే మీట్ కి పవన్ వెళ్తే మోడీ పవన్ భుజం మీద చేయి వేసి పుత్ర వాత్సల్యం తో పలకరించి ఎంతో పరవశం చెందారు.

నిజానికి మోడీకి పవన్ ని చూస్తే తెలియని సంతోషం కలుగుతుంది అని అంతా అంటారు. పవన్ కూడా మోడీలో ఒక గురువుని చూస్తారు. ఇక విశాఖ సభలో మోడీ పవన్ ల మధ్య అనుబంధం ఎలా ఉండబోతోంది. ఎలా ఈ ఇద్దరూ పలకరించుకుంటారు ఎలా మోడీ పవన్ తో వ్యవహరిస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది.

మోడీ విశాఖ సభలో కచ్చితంగా చంద్రబాబు పవన్ ల గురించి ప్రస్తావిస్తారు. అందులో పవన్ గురించి ఆయన ఏమి చెబుతారు అన్నదే అందరి మదిలో ఉన్న విషయం. పవన్ ని ఒకసారి తుఫాను అన్న మోడీ ఈసారి ఏ విధంగా అభివర్ణిస్తారు అన్నది చూడాల్సిందే.

ఏపీలో బీజేపీని అభివృద్ధి చేయాలని బీజేపీ పెద్దగా మోడీ తలపొస్తున్నారు. దాని కోసం ఆయన జనసేన సాయమే ఎక్కువగా తీసుకుంటున్నారు. పవన్ తో ప్రత్యేకమైన స్నేహ బంధాన్ని పొత్తుల కంటే అతీతంగా మోడీ కొనసాగిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన ఏపీలో విశాఖలో జరిగే సభలో కచ్చితంగా జనసేనానిని హైలెట్ చేస్తారు అని అంటున్నారు.

ఒక విధంగా విశాఖ సభను బీజేపీ రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకుంటుంది అని అంటున్నారు. ఎందుకంటే విశాఖలో బీజేపీకి కొంత బేస్ ఉంది. అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీ కూడా గెలిచి ఉన్నారు. రానున్న రోజులలో ఉత్తరాంధ్రాలో మరింత బలపడేలా బీజేపీ ప్రణాళికలు ఉంటాయి. దాంతో ఏపీలో కూటమి ప్రభుత్వం గురించి మోడీ చెబుతూనే ప్రత్యేకించి జనసేనాని మీద ఫుల్ ఫోకస్ పెట్టి హైలెట్ చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.