Begin typing your search above and press return to search.

పవన్ ఆధ్యాత్మిక యాత్ర తర్వాత ?

ఇవన్నీ పక్కన పెడితే పవన్ తాను కోరుకున్నట్లుగా ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. అది చాలా ఫలప్రదం గా సాగుతోంది.

By:  Tupaki Desk   |   15 Feb 2025 3:30 AM GMT
పవన్ ఆధ్యాత్మిక యాత్ర తర్వాత ?
X

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. ఆయన చాలా కాలంగా ఈ యాత్రలు చేయాలనుకుంటున్నానని స్వయంగా చెప్పారు. మొక్కులు మిగిలాయని వాటిని చెల్లించేందుకే వ్యక్తిగతంగా యాత్ర చేస్తున్నానని ఇందులో రాజకీయమేదీ లేదని తేల్చేశారు. ఆయన చెప్పినట్లుగానే ఎక్కడా రాజకీయ ప్రకటనలు అయితే లేవు. ఆయన చాలా ప్రశాంతంగానే తన యాత్రను చేస్తున్నారు.

పవన్ యాత్ర పుణ్యమాని జనాలకు కూడా అనేక ప్రసిద్ధ ఆలయాల గురించి మరింత బాగా తెలిసి వస్తోంది. ఇక పవన్ కి వెళ్ళిన చోటల్లా జనాలు నీరాజనాలు పడుతున్నారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడకు జనాలు వస్తున్నారు. పవన్ కూడా వచ్చిన వారిని ప్రేమతో అభివాదం చేస్తూ పలకరిస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే పవన్ తాను కోరుకున్నట్లుగా ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. అది చాలా ఫలప్రదం గా సాగుతోంది. ఈ యాత్ర ఆయన ముగించుకున్న తర్వాత ఏమి చేస్తారు అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. సరిగ్గా చెప్పాలీ అంటే గత నెల జరిగిన రిపబ్లిక్ డే తరువాత ఆయన పెద్దగా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న దాఖలాలు అయితే లేవు.

ఆయనకు ఈ మధ్యలో తీవ్ర జ్వరం, వెన్ను నొప్పి వంటి వాటి కారణంగా ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇపుడు యాత్ర కూడా సామాన్యమైనది ఏమీ కాదు. ఆయన సుదీర్ఘ సమయం రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తూ చేస్తున్నారు. అందువల్ల యాత్ర అనంతరం ఆయన ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఆ తరువాత ఆయన తిరిగి యధాప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలలో నిమగ్నం అవుతారా అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే ముఖ్యమంత్రి మంత్రులకు ఇచ్చిన ర్యాకింగులలో ఫైళ్ళు క్లియర్ కాని శాఖలలో పవన్ కి చెందినవి ఉన్నాయి. ఆయన అతి పెద్ద శాఖలను చూస్తున్నారు. అంతే కాదు నాలుగు శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన కొద్ది రోజుల నుంచి వీటికి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఫైళ్ళ క్లియరెన్స్ అన్నది చూడాల్సి ఉంది.

అదే సమయంలో ఆయన సీఎం చంద్రబాబుని కలుస్తారా అన్నకూడా ఆసక్తిని కలిగించే విషయంగా ఉంది. ఆయన ఆరోగ్యం విషయంలో ఎలా ఉందో వాకబు చేయడానికి బాబు ఫోన్ స్వయంగా చేశారని ఆయన అందుబాటులోకి రాలేదని ఒక ప్రచారం అయితే సాగింది. మరి తన ఆరోగ్యం కుదుటపడి పవన్ ప్రభుత్వ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యే ముందు బాబుకు కలసి చర్చిస్తారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

కూటమిలో విభేదాలు అని వస్తున్న వార్తలకు ఆయన ఆ విధంగా చెక్ పెడతారా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ నెల 24 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దాంతో ఒక రోజు ముందు అంటే 23న జనసేన శాసనసభా పక్ష సమావేశాన్ని పవన్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సభలో బడ్జెట్ సెషన్ లో అనుసరించాల్సిన దాని మీద వారికి దిశానిర్దేశం చేస్తారు అని అంటున్నారు.

అలాగే నెల రోజులు కూడా పెద్దగా జనసేన ప్లీనరీకి వ్యవధి లేదు. దాంతో ప్లీనరీ విషయంలోనూ ఆయన నాయకులతో కీలక భేటీలు వేసి మాట్లాడుతారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ ఆధ్యాత్మిక యాత్ర వైపే అందరి చూపూ ఉంది. అది ముగించుకుని వచ్చాక ఆయన ఫుల్ బిజీ అవుతారనే అంటున్నారు.