Begin typing your search above and press return to search.

పవన్ పోటీ స్టేట్మెంట్స్...అలెర్ట్ కావాల్సిందేనా ?

మూడు పార్టీల అధినాయకత్వాలు వేరు. వారంతా టీడీపీ కూటమి అధినేత ప్రభుత్వ సారది బాబు మాటలు వింటారా అంటే సంకీర్ణ ధర్మం అయితే పాటించాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   12 Jan 2025 12:30 PM GMT
పవన్ పోటీ స్టేట్మెంట్స్...అలెర్ట్ కావాల్సిందేనా ?
X

ఏపీలో ఈసారి చంద్రబాబు ప్రభుత్వం అని ఎవరూ అనడం లేదు. ఆ మాటకు వస్తే ఎన్డీయే ప్రభుత్వం అని బాబు పదే పదే చెబుతున్నారు. దాని వెనక ఆయన మార్క్ వ్యూహాలు ఉన్నాయి. మరి ఆ వ్యూహాలతో పాటు ఇబ్బందులూ ఉన్నాయి. కూటమి అంటే మూడు పార్టీల కలయిక.

మూడు పార్టీల అధినాయకత్వాలు వేరు. వారంతా టీడీపీ కూటమి అధినేత ప్రభుత్వ సారది బాబు మాటలు వింటారా అంటే సంకీర్ణ ధర్మం అయితే పాటించాల్సి ఉంటుంది. మూడు కాదు పాతిక పార్టీలు కలసిన ప్రభుత్వాన్ని ఒకనాడు ఢిల్లీలో వాజ్ పేయ్ ప్రధానిగా నాయకత్వం వహించి నడిపారు. ఆనాడు కూడా ఏ ఒక్క పార్టీ స్వతంత్రించి ప్రధానికి భిన్నంగా విధాన ప్రకటన అయితే చేయలేదు.

ఇక కేంద్రంలో ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో రెండు పార్టీల బలం మీద ఆధారపడి పాలన చేస్తోంది. అయినా మోడీ పాలనలో ఏ మిత్ర పక్షమూ జోక్యం చేసుకోవడం లేదు, ఎవరూ కూడా సాహసించి సలహాలు అయితే ఇవ్వడంలేదు. కానీ ఏపీలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి అయిన అనుకూల మీడియా అంటోంది.

ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి కూడా విధానపరమైన ప్రకటనలు చేస్తున్నారని దాంతో అధికారులు ఎవరి మాట వినాలో తెలియక గందరగోళం పడుతున్నారు అని అనుకూల మీడియా ఎత్తి చూపుతోంది. లేటెస్ట్ గా చూస్తే తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అక్కడికి వెళ్ళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ బాధితులను కలసి ఓదార్చారు.

అనంతరం టీటీడీ భవనంలో జరిగిన సంఘటన మీద సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. అయితే సీఎం హోదాలో బాబు ఇచ్చిన ప్రకటనకు భిన్నంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేరేగా ప్రకటనలు ఇచ్చారు. అసలు ఆయన వేరేగా పర్యటన చేశారు. వేరేగా మీడియా మీటింగ్ పెట్టారు. అలాగే బాధ్యులుగా టీటీడీ చైర్మన్, ఈవో జేఈవో లను ముందు పెట్టారు.

ఇలా బాబు ఒకటి చెబితే పవన్ మరొకటి చెప్పారు. దీంతోనే చర్చ మొదలైంది. దానికే అనుకూల మీడియా పట్టుకుంది. నిజానికి ఉప ముఖ్యమంత్రి అని అంటున్నా రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అన్నది లేదని ప్రత్యేక అధికారాలు అంతకంటే లేవని కూడా అంటోంది. పవన్ సైతం ఒక మంత్రి మాత్రమే అని పేర్కోంది. ముఖ్యమంత్రి వెంట మంత్రులు అంతా వెళ్ళారని పవన్ జనసేన అధినేత హోదాలో ప్రత్యేకంగా బాధితులను పరామర్శ చేయవచ్చునని కానీ అదే సమయంలో ఆయన విధాన పరమైన ప్రకటనలు చేయడమ ఎందుకు అన్నట్లుగా ప్రశ్నించింది.

ఇది సంకీర్ణ ధర్మానికి ఇబ్బంది అవుతుందని కూడా పేర్కొంది. కూటమి ఐక్యంగా ఉండాలీ అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ చర్చించుకుని ఒకే మాట మీద ఉండాలని సూచించింది. ఈ విషయంలో పవన్ కొంత స్వతంత్రించి మాట్లాడుతున్న తీరు వల్ల ఫ్యూచర్ లో సమస్యలు వస్తాయని అంతిమంగా అది రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుందని కూడా పేర్కొంది.

మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ మీదనే అనుకూల మీడియా అలెర్ట్ చేసింది. నిజానికి అనుకూల మీడియా చెప్పినది అందరికీ తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం ఉప ప్రధాని ఉప ముఖ్యమంత్రులు అని ఉండరు మంత్రిగానే వారు ప్రమాణం చేస్తారు. ఇక ప్రధాని ముఖ్యమంత్రి కే విశేష అధికారాలు ఉంటాయి. వారే కీలక ప్రకటనలు చేస్తారు. విధానపరమైన నిర్ణయాలను వారే తీసుకుంటారు.

పవన్ మిత్ర పక్షంగా ఉన్నారు. ఆయన ఏమైనా ప్రభుత్వ లోపాలను చెప్పాలీ అంటే నాలుగు గోడల మధ్యనే వివరించవచ్చు అన్న సూచనలు వస్తున్నాయి. కానీ పవన్ మాత్రం గతంలో హోం మంత్రిని విమర్శించిన సందర్భంలో కానీ ఇపుడు తిరుపతి తొక్కిసలాట ఘటన కానీ ఈ మధ్యలో కాకినాడ సీజ్ ది షిప్ ఉదంతాల్లో కానీ కొంత స్వేచ్చగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఇవన్నీ కూటమి ప్రభుత్వం మీదనే ప్రభావం చూపిస్తాయన్నట్లుగా టీడీపీ అనుకూల మీడియా రాసుకొచ్చింది. మొత్తానికి ఒక విలువైన సూచనను కూటమి పెద్దలకు ఇస్తున్నట్లుగా ఇదంతా ఉంది. మరి దీని మీద ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సి ఉంది.