పార్టీ టైమ్ అంటున్న పవన్!
అయితే పవన్ మార్క్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ముందు ఉప ముఖ్యమంత్రిగా మంచి మార్కులు వేయించుకోవాలని తపనతో పనిచేయాలని.
By: Tupaki Desk | 31 Dec 2024 1:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు అని చెప్పాలి. ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తరువాత నుంచి తన శాఖల పట్ల పట్టుని సాధించడానికే చూస్తూ వస్తున్నారు. 2024 అంతా దాదాపుగా పవన్ అధికారిక కార్యక్రమాలోనే బిజీగా గడిపారు.
ఆయన ఎంతసేపూ అధికారులతోనే భేటీలు వేస్తూ కనిపించారు. అయితే సచివాలయం లేకపోతే తన మంగళగిరిలోని క్యాంప్ ఆఫీసులో ఆయన సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. ఒక విధంగా పవన్ నిత్య విద్యార్ధిగా మారి తన శాఖల గురించి అన్నీ తెలుసుకున్నారు. అధికారులకు కూడా ఇది ఎంతో ఆశ్చర్యం కలిగించింది అని అంటున్నారు.
తన సందేహాలను ఆయన ఎలాంటి మొహమాటమేదీ లేకుండా అధికారులను అడిగి తెలుసుకుని శాఖాపరంగా తన మంత్రిత్వ శాఖలో తన పట్టుని బాగానే పెంచుకున్నారు. ఒక విధంగా పవన్ అధికారిక కార్యక్రమాలలో తనదైన శైలిని ప్రదర్శిస్తూ కూటమిలోని మంత్రులలో ముందు వరసలో ఉన్నారు.
ఇక పవన్ గడచిన ఏడు నెలల కాలంలో పూర్తి స్థాయిలో అధికారిక కార్యక్రమాలలో నిమగ్నం అయిపోయి రాజకీయాల గురించి తక్కువగానే ఆలోచించాలని చెప్పాలి. అంతే కాదు ఆయన పార్టీ గురించి కూడా తక్కువగానే ఆలోచించారు. నిజానికి అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీని పటిష్టం చేసుకోవడం మీద ఎవరైనా దృష్టి పెడతారు.
అయితే పవన్ మార్క్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ముందు ఉప ముఖ్యమంత్రిగా మంచి మార్కులు వేయించుకోవాలని తపనతో పనిచేయాలని. అది చాలా వరకూ నెరవేరుతోంది. దాంతో ఇపుడు పవన్ పార్టీ కోసం తగినంత సమయం కేటాయిస్తారు అంటున్నారు. 2025 కొత్త ఏడాది పవన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే పార్టీకి టైమ్ ఇస్తూ జనసేనను బలోపేతం చేసుకోవాలని.
పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఆలోచించడంతో క్యాడర్ ఎంతో సంతోషిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలు పార్టీని కూడా పట్టించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది అన్నది జగన్ విషయంలో రుజువు అయింది. వైసీపీ పార్టీని అలా పక్కన పెట్టడం వల్లనే భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఇక టీడీపీలో అయితే చంద్రబాబు అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని కూడా సమాంతరంగా నడిపిస్తున్నారు. దానికి ఆయనకు ఉన్న అనుభవం తోడు అవుతోంది. చేదోడువ్ వాదోడుగా కుమారుడు లోకేష్ కూడా ఉండనే ఉన్నారు.
జనసేన విషయంలో చూస్తే పవన్ కి ఇపుడు తోడుగా నాగబాబు రాబోతున్నారు. ఆయన కొత్త ఏడాదిలో మంత్రిగా ప్రభుత్వంలో చేరుతారు. అలా ప్రభుత్వంతో పాటు పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళడానికి పవన్ కి నాగబాబు సాయం చాలా వరకూ ఉపయోగపడుతుంది అని అంటున్నారు.
అందుకే ఆయన కొత్త ఏడాదిలో ఆరు నెలల కాలాన్ని క్షేత్ర స్థాయిలో అన్ని జిల్లాలలో పర్యటించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా ప్రజలతో మమేకం కావడంతో పాటు పార్టీతోనూ మమేకం కావాలని ఎక్కడికక్కడ పార్టీని గట్టిగా చేసుకోవాలని ఆయన వ్యూహరచన చేస్తున్నారు.
ఇక మీదట పార్టీకి తగినంత సమయం కేటాయిస్తాను అని పవన్ చెబుతున్నారు. ఇది జనసైనికులకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. పవన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినపుడు కచ్చితంగా పార్టీ ఆఫీసులకు వెళ్తారని అక్కడ పార్టీ నాయకులు క్యాడర్ తో కలసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు అని అంటున్నారు. ఆ విధనగ పవన్ జనసేనను కొత్త ఏడాదిలో పరుగులు ఎత్తించబోతున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ 2025 యాక్షన్ ప్లాన్ రెడీ అయినట్లే అంటున్నారు.