Begin typing your search above and press return to search.

ఒకే ఒక్క ఇంటర్వ్యూతో వాటికి పవన్‌ చెక్‌!

తిరుమల లడ్డూ వ్యవహారంపై రాజకీయ పార్టీలే కాకుండా వివిధ రంగాల సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Oct 2024 8:11 AM GMT
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో వాటికి పవన్‌ చెక్‌!
X

తిరుమల లడ్డూ వ్యవహారంపై రాజకీయ పార్టీలే కాకుండా వివిధ రంగాల సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియా వేదికగా, మీడియాతోనూ వెల్లడిస్తున్నారు.

ఈ వివాదం సినిమా తారలను కూడా తాకింది. కొద్దిరోజుల క్రితం ప్రముఖ తమిళ నటుడు కార్తీ తన సినిమా ఈవెంట్‌ లో మాట్లాడుతూ ‘ఇప్పుడు లడ్డూ వద్దు.. నో కామెంట్స్‌’ అంటూ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూ స్పందించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఫైరయ్యారు.

ఈ నేపథ్యంలో తమిళ నటుడు కార్తీ.. పవన్‌ కళ్యాణ్‌ ను ట్యాగ్‌ చేస్తూ తన క్షమాపణలు తెలిపారు. దేవుడిని కించపరచడం తన ఉద్దేశం కాదన్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామిపై తనకు భక్తి, విశ్వాసం ఉన్నాయన్నారు. తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమాపణలు చెబుతున్నానన్నారు.

ఈ నేపథ్యంలో ఒక తమిళ చానెల్‌ పవన్‌ కళ్యాణ్‌ తో గంటపాటు ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇంగ్లిష్‌ లో ఇంటర్వ్యూ నిర్వహించడానికి ఆ చానెల్‌ సిద్ధం కాగా పవన్‌ పూర్తిగా తమిళంలో మాట్లాడుతూ ఇంటర్వ్యూ ఇవ్వడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున ట్రెండ్‌ అవుతోంది. ఇది దేశవ్యాప్తంగా వైరల్‌ గా మారింది.

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ తమిళ సినిమాల గురించి మాట్లాడి ఆశ్చర్చపరిచారు. యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన మండేలా చిత్రం తనను ఆకట్టుకుందని చెప్పారు. అలాగే కమల్‌ హాసన్‌ నటించిన విక్రమ్, విజయ్‌ హీరోగా వచ్చిన లియో సినిమాలను కూడా చూశానన్నారు. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ పైనా పవన్‌ ప్రశంసలు కురిపించారు.

సనాతన ధర్మంపైన కూడా పవన్‌ తన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రముఖ నటులు, రాజకీయవేత్తలు అయిన మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్, దివంగత సీఎం జయలలిత, దివంగత నటుడు విజయ్‌ కాంత్, లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్టీటీఈ) వంటివాటిపైనా పవన్‌ మాట్లాడి ఇంటర్వ్యూయర్‌ ను ఆశ్చర్యచకితుల్ని చేశారు.

ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వైరల్‌ కావడంతో తమిళ ప్రజలు పవన్‌ కళ్యాణ్‌ భాషా పరిజ్ఞానాన్ని ప్రశంసిస్తున్నారు. తమిళ నటుడు కార్తీ క్షమాపణ వ్యవహారంలో పవన్‌ పైన కొందరు తమిళులు సోషల్‌ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ఒకే ఒక్క ఇంటర్వ్యూతో వాటికి చెక్‌ పెట్టారు. తమిళుల మనసు చూరగొన్నారు. తమిళనాడులోనూ పవన్‌ కళ్యాణ్‌ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు చిన్న చిన్న బిట్లుగా వైరల్‌ అవుతున్నాయి.