పవన్ కళ్యాణ్‌కు ‘రియల్’ తలనొప్పి
తిరుపతిలో జనసేనకు చాలా బలమైన వాయిస్ అనదగ్గ కిరణ్ రాయల్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. అతడి మీద ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 9 Feb 2025 10:00 AM GMTఒక రాజకీయ పార్టీ మీద ఇంకో పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఏ రకమైన ఆరోపణలు, విమర్శలు చేశారో.. అవే వాళ్ల మీదికి రివర్సులో వచ్చినపుడు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ ఒక నాయకుడి వల్ల ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటోంది. తిరుపతిలో జనసేనకు చాలా బలమైన వాయిస్ అనదగ్గ కిరణ్ రాయల్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. అతడి మీద ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చింది. తనను అనేక రకాలుగా ఉపయోగించుకుని కోటి రూపాయలకు పైగా డబ్బులు కూడా తీసుకున్న కిరణ్ రాయల్.. ఇప్పుడు వేరే మహిళతో సంబంధం పెట్టుకుని, తనను పట్టించుకోవడం మానేశాడని ఆమె ఆరోపించారు. అంతే కాక కిరణ్‌తో సన్నిహితంగా ఉన్న వీడియోలు.. అతను తనను బూతులు తిట్టి, బెదిరించిన ఆడియోలను సదరు మహిళ రిలీజ్ చేశారు.
నిన్నట్నుంచి ఈ వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ వాళ్లకు జనసేనను టార్గెట్ చేయడానికి ఇవి మంచి ఆయుధాలుగా మారిపోయాయి. కిరణ్ రాయల్.. పలు సందర్భాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా పలువురి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఇటీవలే జగన్ 2.0 వెర్షన్ గురించి కామెంట్ చేస్తే.. వెంటనే ‘2.0’ సినిమాను పోలిన పోస్టర్లు రెడీ చేయించి జగన్‌ను ఎటాక్ చేశాడు కిరణ్. రోజా మీద కూడా పలు సందర్భాల్లో ఘాటు వ్యాఖ్యలు చేశాడు కిరణ్. ఈ నేపథ్యంలో కిరణ్ వీడియోలు, ఆడియోలు బయటికి వచ్చేసరికి వైసీపీ వాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలకు అన్యాయం జరిగితే సహించబోనని ఓవైపు పవన్ కళ్యాణ్ అంటుంటే.. ఆ పార్టీ నేత ఘనకార్యాలు ఇవీ అంటూ వాళ్లు ఎద్దేవా చేస్తున్నారు. కిరణ్ మీద చర్యలు చేపట్టరా అంటూ పవన్‌ను ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లాంటి నేతల వీడియోలు, ఆడియోలు బయటికి వచ్చినపుడు ఆ పార్టీని జనసేన వాళ్లు గట్టిగా టార్గెట్ చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు వైసీపీ వాళ్లు బదులు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతిలో జనసేనకు కిరణ్ కీలకమైన నేత. తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక దశలో కిరణ్ పేరే తెరపైకి వచ్చింది. కానీ తర్వాత చిత్తూరు నుంచి వచ్చిన ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇది వ్యక్తిగత గొడవలా కనిపిస్తున్నప్పటికీ.. కిరణ్ చర్యలతో పార్టీకి చెడ్డపేరు వచ్చేలా కనిపిస్తున్న నేపథ్యంలో పవన్ అతడిపై చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి నెలకొంది.