ఎంజీఆర్‌పై పవన్ మరోసారి ట్వీట్.. ఈదఫా తేల్చేసినట్టే!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్)ను ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు
By: Tupaki Desk | 17 Oct 2024 12:01 PM GMTతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్)ను ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు(అక్టోబరు 17) అన్నడీఎంకే పార్టీని స్థాపించిన రోజు కావడంతో ఆ పార్టీకి తాజాగా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా.. ఎంజీఆర్, మాజీ సీఎం జయలలితలను ప్రశంసిచారు. తనకు ఎంజీఆర్ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని పవన్ వ్యాఖ్యానించారు. ఆయన ఆశయా లను.. తర్వాత తరం నాయకురాలిగా జయలలిత కొనసాగించారని తెలిపారు.
పేదలకు, అభాగ్యులకు ఎంజీఆర్ చేసిన సేవ మహోన్నతమని పేర్కొన్నారు. వారిని ఆత్మగౌరవంతో జీవించేలా చేశారని తెలిపారు. ఎంజీఆర్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళ్లారని పవన్ పేర్కొన్నారు. తమిళనాడును దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. తనకు ఎంజీఆర్ ఆదర్శమని.. ప్రజలు, పాలన పట్ల ఎంజీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధిని చూసి తాను ఎంతో నేర్చుకున్నానని.. స్ఫూర్తి పొందానని పవన్ తెలిపారు.
ప్రస్తుతం అన్నాడీఎంకే అధినేతగా ఉన్న పళని స్వామి.. కూడా పార్టీని అదేవిధంగా ముందుకు తీసుకువెళ్లాలని పవన్ సూచించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నాడీఎంకే నాయకులకు పవన్ శుభా కాంక్షలు తెలిపారు. ఇదిలావుంటే.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి కలిపారన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తమిళనాడు పాలిటిక్స్‌పై తొలిసారి రియాక్ట్ అయ్యారు.
ఆ సమయంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ఇక, అప్పటి నుంచి తమిళనాడులోని ప్రతిపక్షం అన్నాడీఎంకే గురించి.. పవన్ కల్యాణ్ తరచుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆపార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. చిత్రం ఏంటంటే.. కేంద్రంలోని బీజేపీకి మిత్ర పక్షంగా అన్నాడీఎంకే ఉండడం గమనార్హం. ఆ బీజేపీకి పవన్ కల్యాణ్ మిత్రపక్షంగా ఉండడం తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. అన్నాడీఎంకేను మోస్తున్న విధానం వంటివి చర్చకు వస్తున్నాయి.