‘అవినీతి నుంచి సంక్రమించిన వారసత్వం డ్రగ్స్’... పవన్ సంచలన వ్యాఖ్యలు!
ఈ దశాబ్ధ కాలంలో పెరిగినట్లు చెబుతున్న డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో పవన్ స్పందించారు.
By: Tupaki Desk | 9 Nov 2024 6:46 AM GMTఇప్పుడు భారతదేశంలో డ్రగ్స్ అనేది అతిపెద్ద సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే. నిత్యం ఎదో ఒక మూల కిలోలకు కిలోలు, టన్నులకు టన్నుల చొప్పున గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్ధాలు పోలీసుల దాడులలో పట్టుబడినట్లు కథనాలొస్తున్నాయి. దీంతో... పట్టుబడనివి ఇంకా ఎన్ని ఉన్నాయనే చర్చ తెరపైకి వస్తోంది.
ఈ విషయంలో కేంద్రం సీరియస్ గా దృష్టి పెట్టాలనే డిమాండ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువై ఉన్న వేళ.. ఈ దశాబ్ధ కాలంలో పెరిగినట్లు చెబుతున్న డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో పవన్ స్పందించారు.
అవును... రాష్ట్రంలో మాదకద్రవ్యాలు పెనుముప్పుగా మారాయని డిపూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ అవినీతి నుంచి ఎన్డీయే కూటమికి సంక్రమించిన వారసత్వ సమస్య ఇది అని పేర్కొన్నారు. నేరస్థుల కట్టడికి సమగ్ర కార్యచరణ ప్రాణాళిక అవసరమని అన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టిన ఆయన.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ట్యాగ్ చేశారు!!
ఈ సందర్భంగా స్పందించిన పవన్... రాష్ట్రంలో డ్రగ్ పెనుముప్పుగా మారిందని.. ఇది ఎన్డీయే ప్రభుత్వానికి గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన వారసత్వ సమస్య అని.. రాష్ట్రంలో గంజాయి సాగు, డ్రగ్స్ మాఫియా, సంబందిత కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
ఇదే సమయంలో... కొంతకాలం క్రితం విశాఖ ఓడరేవులో కొకైన్ స్వాధీనం చేసుకోవడం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో పట్టుబడిన డ్రగ్స్ కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాని అన్నారు. ఇది గత పాలనలో డ్రగ్స్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందని సూచిస్తుందని తెలిపారు. ఈ నేరగాళ్లను కట్టడి చేసేందుకు సమగ్ర ప్రణాళిక అవసరం అని అన్నారు.