పవన్ చూసేశారు.... బాబుదే బకాయి
ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేశారు.
By: Tupaki Desk | 22 Oct 2024 3:47 AM GMTఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేశారు. ఆయన టూర్ లో లేని ప్రోగ్రాం ని లాస్ట్ మినిట్ లో చేర్చుకున్నారు. అంతే ఆల్ ఆఫ్ సడెన్ గా విజయనగరం మీద నుంచి విశాఖ బీచ్ రోడ్డుకు డిప్యూటీ సీఎం వాహనాలు టర్న్ అయ్యాయి.
అలా అందరినీ ఆశ్చర్యపరుస్తూ రుషికొండ భవనాల వద్ద పవన్ ప్రత్యక్షం అయ్యారు. దాంతో అధికారులు మొత్తం హడావుడి పడ్డారు. పవన్ కళ్యాణ్ రుషికొండ ప్యాలెస్ లో మొత్తం కలియతిరిగారు. అక్కడ ఉన్న పరిస్థితులను గమనించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రుషికొండ పై నుంచి విశాఖ బీచ్ అందాలను ఆయన చూశారు. వాటికి సంబంధించిన ఫోటోలను ఆయన తీసుకున్నారు. విశాఖ బీచ్ అందాలను ఎత్తైన రుషికొండ పై నుంచి చూస్తూ ఆయన కొంతసేపు గడిపారు.
ఇదిలా ఉంటే సరిగ్గా రెండేళ్ళ క్రితం ఇదే నెలలో పవన్ విశాఖలో పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు ఉన్నారు. ఆనాడు ఆయన నిర్మాణంలో ఉన్న రుషికొండను చూడాలని అనుకున్నారు. ఆయనతో పాటు జనసైనికులు కూడా వచ్చారు. అయితే పవన్ ని నాడు రుషికొండని చూడకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది.
క్యాలెండర్ లో గిర్రున రెండేళ్ళు తిరిగేసరికి 2022 కాస్తా 2024 అయింది. మళ్ళీ అదే అక్టోబర్ వచ్చింది. ఈసారి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో రుషికొండ పైకి దర్జాగా వచ్చారు. అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి తోడ్కొని వెళ్ళారు.
ఆ విషయాలను జనసైనికులతో పాటు అంతా గుర్తు చేసుకుంటూ పవన్ రాజకీయంగా ఎదిగిన తీరుని రుషికొండంతగా పెరిగిన ఆయన రాజకీయ ప్రతిష్టను మననం చేసుకున్నారు. మరో వైపు చూస్తే పవన్ చాలా సింపుల్ గా అందరితోనూ కలసిపోతూ కనిపించారు.
మొత్తానికి చూస్తే ఇప్పటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుషికొండ చూశారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మాత్రం చూడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు పూర్తి అయినా రుషికొండ మీద ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయమూ తీసుకోలేదు.
తాజాగా విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ అయితే రుషికొండ పైన ఉన్న భవనాల నిర్మాణానికి ఏకంగా ఆర్భాటాలు చేస్తూ ఏడు వందల కోట్లు ఖర్చు చేసిందని లెక్క చెప్పారు. ఇపుడు దానిని ఏ విధంగా ఉపయోగించాలో మీడియావే సలహా ఇవ్వాలని కోరారు.
లోకేష్ ఇప్పటికి పలుమార్లు విశాఖ వచ్చినా రుషికొండ ప్యాలెస్ అయితే చూడలేదు. అదే విధంగా చంద్రబాబు కూడా ఒకటి రెండు సార్లు విశాఖ వచ్చినా ఆ పని ఒత్తిడిలో రుషికొండ వైపు దృష్టి సారించలేకపోయారు. చంద్రబాబు తొందరలో సందర్శించిన మీదటనే రుషికొండ విషయంలో ఒక కీలక నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు.