పవన్ లక్ష్మణ రేఖలు.. ఎవరి కోసం.. !
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు.
By: Tupaki Desk | 28 Jan 2025 7:30 PM GMTజనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ లక్ష్మణ రేఖలు దాటడానికి వీల్లేదని చెప్పుకొచ్చారు. అయితే.. పవన్ ఇలా హెచ్చరిక లు జారీ చేయడం ఇదే తొలిసారి కాదు. కూటమి సర్కారులో పార్టీ భాగస్వామ్యం పంచుకున్న దరిమిలా.. మూడోసారి ఆయన పార్టీ నేతలను హెచ్చరించారు. ఈసారి కొంత తీవ్రంగానే చెప్పారని చెప్పాలి. సుదీర్ఘమైన బహిరంగ లేఖలో కూటమి ప్రభుత్వ ప్రాధాన్యాన్ని వివరించారు.
ఇదే సమయంలో లక్ష్మణ రేఖల గురించి కూడా వివరించారు. క్షేత్రస్థాయిలో నాయకులు నోరు జారుతున్నారని.. ఇక నుంచి ఎవరూ నోరు విప్పద్దని చెప్పుకొచ్చారు. ఏదైనా ఉంటే తానే చూసుకుంటానని కూడా వెల్లడించారు. అయితే.. ఈ ప్రకటనలు, ఈ హెచ్చరికలను ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారన్నది జనసేన లోనే కాదు.. రాజకీయంగా కూడా చర్చకు వస్తోంది. వాస్తవానికి క్షేత్రస్థాయి నాయకులు ఎవరూ నోరు విప్పరు. మిడిల్ పొజిషన్లో ఉన్నవారు.. లేదా ఎమ్మెల్యేలుగా ఉన్నవారే ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారన్నది వాస్తవం.
అయితే.. వారిలో ఉన్న అసంతృప్తులు, పదవులపై వారు పెట్టుకున్న ఆశలను నెరవేర్చడమో.. లేదా నచ్చజెప్పుకోవడమో చేయాలి తప్ప.. ఇలా ప్రకటనలతో పని జరుగుతుందా? అనేది ప్రధాన ప్రశ్న. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కృషి చేసిన వారే. ఎవరినీ తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. అయితే.. పార్టీ పరిస్థితిని అర్ధం చేసుకోవడంలోనూ.. కూటమి నేతలుగా వ్యవహరించాల్సిన తీరులోనూ.. కొంత ఎడబాటు కనిపిస్తోంది. దీనిని చక్కదిద్దడంలోనే.. పవన్ కల్యాణ్ప్రజ్ఞత కనిపించాల్సి ఉంది.
చీటికీ మాటికీ తెరమీదికి వస్తున్న వివాదాలు... జనసేన పార్టీకి ప్రతిబంధకంగా మారాయన్నదివాస్తవం. పవన్ ఇమేజ్ను తక్కువ చేసి చూడకపోయినా.. జనంలో జనసేన పార్టీపై ఇంకా పుంజుకున్న పరిస్థితి అయితే కనిపించడంలేదు. దీనికి తోడు నాయకుల వ్యక్తిగత వ్యవహారాలు.. పదవీ కాంక్ష, ఆధిపత్య ధోర ణులు.. కూటమి నేతల మధ్య పొసగని వైనాలు.. ఇలా అనేక సమస్యలు పార్టీకి ఇబ్బందిగా మారాయన్నది వాస్తవం. ముందుగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తే.. అందరూ లైన్లోకి వచ్చేస్తారన్నది కీలక అంశం. లేకపోతే.. ఎన్ని హెచ్చరికలు చేసినా నిష్ప్రయోజనంగానే మారుతాయన్నదివాస్తవం.