Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంత తగ్గితే పవన్ కి అంత హుషార్ !

ఏపీలో కానీ దేశంలో కానీ ఎపుడూ రెండే పార్టీల వ్యవస్థ ఉంటుంది. అది ఒకటి అధికార పక్షం. రెండు విపక్షం.

By:  Tupaki Desk   |   30 Aug 2024 5:30 PM GMT
వైసీపీ ఎంత తగ్గితే పవన్ కి అంత హుషార్ !
X

ఏపీలో కానీ దేశంలో కానీ ఎపుడూ రెండే పార్టీల వ్యవస్థ ఉంటుంది. అది ఒకటి అధికార పక్షం. రెండు విపక్షం. అధికార పక్షం మీద మొహం మొత్తితే ప్రధాన ప్రతిపక్షానికి జనాలు జై కొడతారు. ఇతర పక్షాలు ఎన్ని ఉన్నా వారికి అధికారం దక్కడం చాలా కష్టం అవుతుంది. ఏపీలో చూస్తే టీడీపీ కూటమి పేరుతో బీజేపీ టీడీపీ జనసేన జట్టు కట్టాయి. ఇవి రాజకీయ అవసరాల కోసం అన్నది తెలిసిందే.

ఆ రోజు ఎదురుగా వైసీపీ ఉంది. కాబట్టి దాన్ని దించడం కోసం ఈ పొత్తు ఏర్పడింది. ఎల్లకాలం ఇదే విధంగా ఉంటుంది అని ఎవరూ అనుకోరు. బీజేపీకి అధికారం మీద ఆశ ఉంది. జనసేనకూ పవర్ కావాల్సి ఉంది. అయితే టీడీపీ కూటమికి వైసీపీ పోటీ ఇచ్చేంతవరకూ ఈ కూటమిలో సయోధ్య కొనసాగుతూనే ఉంటుంది.

ఎందుకంటే చాన్స్ దొరికితే మళ్లీ వైసీపీ బలపడి అధికారంలోకి వస్తుంది అన్న బెంగ ముగ్గురు మిత్రులలోనూ ఉంటుంది. ఆ బెంగ అనే సిమెంట్ తోనే కూటమి భవనం అతుక్కుని పటిష్టంగా ఉంటుంది. 2029లోనూ టీడీపీ కూటమి పోటీ చేస్తుంది అని ఎన్నికలకు ముందే పవన్ చెప్పేశారు. టీడీపీతో పొత్తు పదేళ్ల పాటు కొనసాగాలని కూడా ఆయన ఆకాంక్షించారు. అంటే వైసీపీ ఓటమి పాలు అయినా 2029 నాటికి కూడా టీడీపీ కూటమికి గట్టి ఫైట్ ఇస్తుందని ఆనాడు భావించి పవన్ ఈ మాటలు అన్నారు అనుకోవాలి.

కానీ ఏపీలో సీన్ చూస్తూంటే కేవలం మూడు నెలలు కూడా గట్టిగా గడవకుండానే వైసీపీ అన్న రాజకీయ సౌధం పేక మేడ మాదిరిగా కూలుతోంది. మేము అక్కడ ఉండమని బడా నాయకులు పార్టీ ఫౌండేషన్ నుంచి ఉన్న లీడర్లు అన్నీ తెంపుకుని వచ్చేస్తున్నారు అంటే ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు. ఏ పార్టీలో అయినా ఉండాలీ అంటే విధేయతతో పాటు ఎమోషనల్ బాండేజ్ కూడా ఉండాలి.

వైసీపీలో చూస్తే ఇపుడు అవేమీ కనిపించడం లేదు అని అంటున్నారు. అందుకే టీడీపీ వైపు వస్తున్నారు అని అంటున్నారు. ఇంతలా వైసీపీ తొందరలోనే రాజకీయ పతనం చెందుతుందని ఎవరూ ఊహించడం లేదు అని అంటున్నారు. అయితే అధికారం ఉన్న వైపు నాయకులు పరుగులు తీయడం సహజం. ఆ విధంగా చూసుకున్నా వైసీపీకి సమీపంలో ఏ ఒక్క పదవీ తమకు ఉన్న సంఖ్యాబలంతో ఇచ్చే అవకాశాలు లేకపోవడం వల్లనే ఈ రకంగా జరుగుతోంది అని అంటున్నారు.

ఇలా వైసీపీ తగ్గిపోవడం టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ ఖుషీని ఇస్తోంది అని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ. ఆ పార్టీకి ఇపుడు అవసరాన్ని మించి బలం ఉంది. ఇంకా ఎక్కువ అయితే వర్గ పోరు తప్ప ఏమీ ఒరిగేది ఉండదు. పైగా వైసీపీకి ఇతర పార్టీల నుంచి తెచ్చుకుని తమ పార్టీని న్యూ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరమూ లేదు. ఆ పార్టీ ఎప్పటికపుడు పరిస్థితులకు అనుగుణంగా పెంచుకుంటూ పోతోంది.

దాంతో వైసీపీ బలహీనం అయితే బలపడేది కచ్చితంగా జనసేన అని అంటున్నారు. ఈ రోజుకు టీడీపీకి జనసేన మిత్రుడిగా ఉన్నా రానున్న రోజులలో పటిష్టంగా మారాలని అనుకుంటోంది. దానికి తగిన వేదిక ప్రాతిపదిక తయారు అయితే జనసేన కూడా తన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి పెట్టుకుంటుంది అని అంటున్నారు.

ఆ విధంగా వైసీపీ నుంచి వచ్చే జనాలు ఈ రోజున పెద్ద ఎత్తున టీడీపీలో చేరినా తరువాత కాలంలో అక్కడ చాన్స్ దక్కకపోతే జనసేనలోకే వస్తారు అన్న లెక్కలూ ఉన్నాయి. జనసేనకు చూస్తే గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో పట్టు ఉంది. గుంటూరు, క్రిష్ణాలలో కొంత బలం ఉంది. పట్టు సంపాదించాల్సింది గట్టిగా రాయలసీమ జిల్లాలలోనే.

టీడీపీ ఇప్పటికే అక్కడ పటిష్టంగా ఉంది కాబట్టి వైసీపీ వీక్ అయితే ఆల్టర్నేషన్ గా జనసేనను నేతలు ఎంచుకుంటారు అన్న అంచనాలూ ఉన్నాయి. దాంతో వైసీపీ రాజకీయంగా ఎంత తగ్గితే అంతలా జనసేన ఎదుగుతుందని కూడా భావిస్తున్నారు. అదే కనుక జరిగితే 2029 నాటికి కూటమి పొత్తులు ఈ విధంగానే ఉంటాయా అన్నది పెద్ద సస్పెన్స్ అని అంటున్నారు.

రాజకీయాల్లో అవకాశాలు ఎపుడూ ఎవరూ ఇవ్వరు. కోరి తీసుకోవడమే. వైసీపీ అనే బలమైన పార్టీ కనుక క్షీణించడం మొదలెడితే ఆ పొలిటికల్ స్పేస్ లోకి దూరేందుకు జనసేన కచ్చితంగా ప్రయత్నం మొదలుపెడుతుంది. అపుడు ఏపీలో టోటల్ గా రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుంది అని అంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.