Begin typing your search above and press return to search.

పవన్ సంకల్పం.. లోకేశ్ సహకారం.. మొగల్తూరు హైస్కూల్ కు మహర్దశ

ప్రభుత్వంలో టాప్ 2, టాప్ 3 జోడి జంటగా తీసుకున్న ఈ నిర్ణయం పాఠశాల విద్యాశాఖలోనే ఓ రికార్డుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   30 March 2025 8:45 AM
Pawan Kalyan and Lokesh Strengthen Political Bond
X

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత లోకేశ్ జోడి అదరగొడుతున్నారు. ఇద్దరూ కలిసి పనిచేయడమే కాకుండా ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ తమ బంధం చిరస్థాయిగా నిలుస్తుందని సంకేతాలిస్తున్నారు. ముఖ్యంగా పవన్ ను ఎంతో గౌరవిస్తున్న లోకేశ్.. జనసేనాని ఆశయాల సాధనకు నేను సైతం అంటూ లోకేశ్ ఆయన అడుగులో అడుగు వేస్తున్నారు. ముఖ్యంగా పవన్ స్వస్థలం మొగల్తూరులో పాఠశాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం అనుకున్న వెంటనే మంత్రి లోకేశ్ రూ.1.71 కోట్లు విడుదల చేయడం చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వంలో టాప్ 2, టాప్ 3 జోడి జంటగా తీసుకున్న ఈ నిర్ణయం పాఠశాల విద్యాశాఖలోనే ఓ రికార్డుగా చెబుతున్నారు.

మొగల్తూరు మెగాస్టార్ చిరంజీవి సొంతూరు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉండే మొగల్తూరు సాధారణ గ్రామం. మెగాస్టార్ సొంత ఊరు కావడంతో ఆ పల్లెకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చాక తన సొంతూరికి ఏదైనా చేయాలని భావించారు. ప్రధానంగా మొగల్తూరు పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా తన టీమును పంపించి మొగల్తూరు పాఠశాలకు ఏయే వసతులు అవసరమవుతాయో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

పవన్ ఆశయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ కూడా మొగల్తూరు పాఠశాలపై ఫోకస్ చేశారు. తన సోదరుడు, జనసేనాని సంకల్పాన్ని తెలుసుకుని మొగల్తూరు పాఠశాలకు నిధుల వరద పారించారు. సాధారణంగా ఏదైనా పాఠశాలకు రూ.10 నుంచి రూ.20 లక్షలు కేటాయించి అభివృద్ధి పనులు చేస్తుంటారు. కానీ, డిప్యూటీ సీఎం అడిగిందే తడువుగా లోకేశ్ స్పందిస్తూ మొగల్తూరు పాఠశాలకు ఏకంగా రూ.1.71 కోట్లు విడుదల చేసి ఆ పాఠశాల రూపురేఖలే మార్చేయాలని నిర్ణయించారు.

పంచాయతీరాజ్ శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రంలో రహదారులు, గోశాలల నిర్మాణంపై పెద్దఎత్తున ఫోకస్ చేశారు. పల్లెపండుగ ద్వారా గిన్నీస్ రికార్డులు నమోదు చేశారు. అభివృద్ధి పనుల్లో ఆయనతో పోటీ పడాలని భావిస్తున్న మంత్రి లోకేశ్ డిప్యూటీ సీఎం కోరుకున్న విధంగా మొగల్తూరుకి నిధులు విడుదల చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీస్తోంది. పవన్ సంకల్పం, లోకేశ్ సహకారంతో ఒక పాఠశాల రూపురేఖలే మారిపోయాయని, ఈ జోడి తలచుకుంటే రాష్ట్రం కూడా అభివృద్ధి పథాన పరుగులు తీస్తుందని అంటున్నారు.