మహా లెక్క: పవన్ ప్రచారంతో బీజేపీకి వచ్చే ఓట్లెన్ని.. !
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి మహాయుతి పక్షాన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారు.
By: Tupaki Desk | 18 Nov 2024 10:30 PM GMTమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి మహాయుతి పక్షాన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి సీఎం చంద్రబాబు కూడా ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కానీ, ఆయన సోదరుడు రామ్మూర్తినాయుడు మృతి చెందడంతో ఈ ప్రచార షెడ్యూల్ రద్దయింది. దీంతో పవన్ ఒక్కరే తెలుగు వారు అధికంగా ఉండే నియోజకవర్గాలు, జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. బీజేపీ అభ్యర్థులను మహాయుతి కూటమి అభ్యర్థులను కూడా గెలిపించాలని పిలుపునిచ్చారు.
పవన్ తిరిగిన జిల్లాలను పరిశీలిస్తే.. షోలాపూర్, పుణే, షిర్డీ వంటివి తెలుగువారు ఎక్కువగా ఉన్న జిల్లాలు. దీంతో పవన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. ఆయన ప్రచారం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. దీంతో బీజేపీ ఓట్ల లెక్కలో పవన్ తురుపు ముక్క అవుతారని కూడా భావించారు.కానీ, మహారాష్ట్రలో ఉన్న తెలుగు వారిలో ఎక్కువగా ఉన్నది తెలంగాణకు చెందిన వారే. ఈ విషయం పవన్‌కు కూడా తెలుసు.
అయితే.. ఈ వ్యవహారంలోనే పవన్ కల్యాణ్ తప్పటడుగులు వేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు నాయకులు పరువు తీస్తున్నారంటూ.. పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలపై నిప్పులు చెరిగారు. ఇది స్థానికంగా ఉన్న తెలుగు వారిని చర్చించుకునేలా చేసింది. పవన్ ప్రచారానికి భారీ ఎత్తున స్పందన వచ్చినా.. ఆయనను చూసేందుకు వచ్చిన యువతరం నాయకులే ఎక్కువగా ఉన్నారు.
కాబట్టి ఏమేరకు పవన్ ప్రభావితంచూపిస్తున్నారనేది ప్రశ్న. ఇక, మరోకీలక విషయం.. షోలాపూర్, షిరిడీ, నాందేడ్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి.. అక్కడ కూడా పవన్ ప్రచారం ఏమేర కు కలిసి వస్తుంది? ఏమేరకు ఆయన పట్ల ఓటర్లు మొగ్గు చూపుతారు? అనేది చూడాలి. ఇక్కడ బీజేపీకి బలం తక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో కూడా మెజారిటీ నాయకులు కాంగ్రెస్ నేతలే. సో.. ఎలా చూసుకున్నా.. పవన్ ప్రచారంతో బీజేపీకి 2-5 శాతం మధ్యలో ఓటు బ్యాంకు పెరిగినా ఆయన సాధించిన ఘన విజయంగానే చెప్పాల్సి ఉంటుంది.