Begin typing your search above and press return to search.

పవన్ నాగబాబు రేర్ కాంబో !

ఇద్దరు అన్నదమ్ములు ఒక మంత్రివర్గంలో పనిచేసిన సందర్భాలు అయితే ఎంత తరచి చూసినా లేనే లేవు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   10 Dec 2024 6:54 AM GMT
పవన్ నాగబాబు రేర్ కాంబో !
X

అవును. పొలిటికల్ హిస్టరీలో చూస్తే ఇది రేర్ కాంబో అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే ఇప్పటిదాకా జరగని ముచ్చటగా కూడా చెప్పుకోవాలి. ఇద్దరు అన్నదమ్ములు ఒక మంత్రివర్గంలో పనిచేసిన సందర్భాలు అయితే ఎంత తరచి చూసినా లేనే లేవు అని అంటున్నారు.

తన కేబినెట్ లో మంత్రిగా నాగబాబుని తీసుకుంటున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించాక ఆ రేర్ కాంబోని ఏపీలో చూడబోతున్నామని అందరికీ అర్థం అయింది. దేశ రాజకీయాలు చూసినా తెలుగు నాట చూసినా ఒకే సమయంలో ఒకే కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఇద్దరు అన్నదమ్ముల కధ అయితే లేనే లేదు అని అంటున్నారు.

జాతీయ స్థాయిలో చూస్తే పండిట్ నెహ్రూ తొలి ప్రధానిగా ఉండగా ఆయన కుమార్తె ఇందిరా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా మాత్రమే పనిచేసారు. ఇక ఆమె మంత్రివర్గంలో కూడా రాజీవ్ గాంధీకి చాన్స్ ఇవ్వలేదు. ఆయన కూడా ఎంపీగానే ఉన్నారు.

అయితే కర్ణాటకలో మాత్రం 2018లో ఈ రేర్ కాంబో కుదిరింది అని అంటున్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన అన్నయ్య రేవణ్ణ మంత్రిగా అదే కేబినెట్ లో చేరారు. అయితే ఇద్దరూ మంత్రులుగా కాదు అని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది.

ఇక తెలంగాణాలో చూస్తే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే కేటీఆర్ మంత్రిగా ఉన్నారు. ఆయన బావ హరీష్ రావు మరో మంత్రిగా ఉన్నారు. దివంగత ఎన్టీఆర్ కేబినెట్ లో తోడల్లుళ్ళు వరసకు అన్నదమ్ములు అయిన చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వేరు వేరు సందర్భాలలో మంత్రులు అయ్యారు తప్ప ఒకేసారి మంత్రి మండలిలో పనిచేసిన చరిత్ర అయితే లేదు.

తమిళనాడులోనూ ఇలాంటి అరుదైన రాజకీయ సన్నివేశం అయితే జరగలేదు. కరుణానిధి సీఎం గా ఉంటే ఉప ముఖ్యమంత్రిగా స్టాలిన్ చేశారు. స్టాలిన్ సీఎం గా ఉంటే ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పనిచేశారు. అంతే తప్ప అన్నదమ్ములు అయితే ఎక్కడా పని చేయలేదు. స్టాలిన్ అన్నయ్య అలిగిరి ఎంపీగా కేంద్ర రాజకీయాల్లో ఉంటూ వచ్చారు.

ఇక ఏపీలో పవన్ తో పాటు నాగబాబు కూడా మంత్రిగా ఉండబోతున్నారు. ఇలా ఒకే సమయంలో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు అంటే అది కచ్చితంగా రేర్ కాంబో అనె అంటున్నారు. గతాన్ని ఎంత తరచి చూసినా లేదా వర్తమానంలో చూసినా ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములు కేబినెట్ లో కలసి పనిచేయడంఅన్నది జరగలేదు.

ఆ ఘనత మాత్రం అచ్చంగా పవన్ నాగబాబులకే దక్కబోతోంది అని చెప్పాలి. ఇంకో విశేషం ఎంటి అంటే ఇదే కేబినెట్ లో చంద్రబాబు లోకేష్ కలసి పనిచేస్తున్నారు. ఈ ఇద్దరూ తండ్రీ కొడుకులు. అంటే ఒక వైపు తండ్రీ కొడుకులు, మరో వైపు అన్న దమ్ములు రెండు కీలక కుటుంబాలకు చెందిన ముఖ్యులు అంతా కలసి మంత్రివర్గంలో ఉండడం కూడా రేర్ అనే చెప్పాలని అంటున్నారు

దీని మీదనే మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు అని ట్వీట్ చేశారు. ఎవరేమనుకున్నా ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి నచ్చిన వారిని మంత్రులుగా చేసుకునే అవకాశం అధికారం ప్రభుత్వ పెద్దలకు ఉంటుంది.

అయితే ఈ రకమైన మంత్రివర్గ కూర్పునకు జనం ఎంతవరకూ మద్దతు ఇస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది. అవినీతి బంధుప్రీతి అన్న ఈ రెండు జాఢ్యాలూ ప్రజాస్వామ్యానికి పట్టిన చీడలు అని అంతా అంటూంటారు. వీటిని పక్కన పెడితేనే ప్రజాస్వామ్య రధం సాఫీగా సాగుతుంది. కానీ వర్తమానంలో అవి అంతకంతకు పెరిగిపోతున్నాయి. అందువల్ల ఎవరూ ఏమీ చేసేది లేదు అనే అంటున్నారు. సో మొత్తానికి చూడాల్సింది ఏంటి అంటే ఏపీ కేబినెట్ లో ఇద్దరు అన్న దమ్ములు తండ్రీ కొడుకులతో సాగే ప్రభుత్వ రధం పనితీరుని మాత్రమే అని అంతా అంటున్నారు.