పవన్ 'పల్లె పండుగ'.. ఎలా ఉంది?
ఇప్పటికి ఈ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం పూర్తయింది. కానీ, కొన్నికొన్ని గ్రామాల్లో అనివార్య అడ్డంకుల కారణంగా కొనసాగుతోంది.
By: Tupaki Desk | 23 Oct 2024 4:30 PM GMTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కూడా మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గ్రామీణ ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుని పలు కార్యక్ర మాలు చేపడుతున్నారు. గతంలో ఒక్కరోజే 'గ్రామ సభల' పేరిట నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. ప్రతి గ్రామంలోనూ సభలు నిర్వమించారు. 3300 పైచిలుకు గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ నెల 14న 'పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికి ఈ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం పూర్తయింది. కానీ, కొన్నికొన్ని గ్రామాల్లో అనివార్య అడ్డంకుల కారణంగా కొనసాగుతోంది. అయితే.. గ్రామసభలకు వచ్చినంత పేరు వీటికి రావడం లేదు. పైగా వారం రోజుల కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అధికారులు మాత్రమే హాజరయ్యారు.
వీటి ఉద్దేశం ప్రధానంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడం. అయితే.. ప్రస్తు తం వర్షాకాలం కావడంతో ఈ పనులను ప్రారంభించేందుకు అవకాశం లేదు. కేంద్రం కూడా ఇప్పుడు నిధులు ఇవ్వదు. దీంతో ఈ కార్యక్రమానికి బ్రేకులు పడ్డాయి. ఇక, క్షేత్రస్థాయిలో గ్రామీణ రహదారులను నిర్మించాలని.. వాటిని అద్దంలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. వీటికి కూడా కొన్ని చోట్ల మాత్రమే శ్రీకారం చుట్టారు. మిగిలిన చోట్ల నిధులు ఉన్నా.. పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
దీనికి కారణాలు అన్వేషిస్తే.. గతంలో చేసిన పనులకే ఇప్పటి వరకు సొమ్ములు చెల్లించలేదు. ముందు వాటిని సెటిల్ చేయాలన్నది కాంట్రాక్టర్ల డిమాండ్‌గా ఉంది. కానీ, సర్కారు మాత్రం తమ హయాంలో చేసిన పనులకు మాత్రమే నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో పనులు చాలా చోట్ల ప్రారంభం కాలేదు. ఇక, ప్రజలతో మమేకం కావాల్సిన కూటమి పార్టీలు.. ఈ కార్యక్రమాన్ని కేవలం జనసేనకు సంబంధించిందిగా మాత్రమే చూస్తున్నారు. వెరసి మొత్తంగా పల్లె పండుగ.. నత్తనడకన సాగుతోంది.