ఏపీలో హైడ్రా...కూటమి రెడీనా ?
ఏపీలో హైడ్రా లాంటి బలమైన వ్యవస్థ రావాల్సిందేనా అంటే దాని మీద అనేక రకాలుగా చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 5 Sep 2024 3:32 AM GMTఏపీలో హైడ్రా లాంటి బలమైన వ్యవస్థ రావాల్సిందేనా అంటే దాని మీద అనేక రకాలుగా చర్చ సాగుతోంది. తెలంగాణాలో హైడ్రా ఒక సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో హైడ్రా చాలా సమర్థంగా పనిచేస్తోంది. చెరువులు నాలాలు ఆక్రమించుకుని కట్టిన వారి పనిని హైడ్రా పడుతోంది. దానికి మేధావులు ప్రజా సంఘాలు ప్రజల నుంచి మద్దతు దక్కుతోంది.
ఇపుడు ఏపీలో బెజవాడ మునగడంతో హైడ్రా ప్రస్తావన ఏపీలో ఎక్కువగా వస్తోంది. ఏపీలో కూడా బుడమేరు పొంగి ఊరి మీదకు రావడం వెనక ఆక్రమణలు పెద్ద ఎత్తున ఉన్నాయని అంటున్నారు. దాంతో పాటు చెరువులు కరకట్టలు నదులు వాగులు మళ్ళింపునకు అవకాశం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కట్టేసిన తీరుతోనే ఇలా బుడమేరు పొంగింది అని అంటున్నారు.
దీని మీద కూటమి ప్రభుత్వం ఏమి ఆలోచిస్తోంది అన్నదే హాట్ టాపిక్ గా ఉంది. అయితే ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే తన మనసులో మాటను బయట పెట్టారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చేసున్నది కరెక్ట్ అని ఆయన అన్నారు. గతంలో చెరువుల మీద నిర్మాణాలు చేపట్టడం చూసి తాను బాధపడేవాడిని అని ఆయన అన్నారు.
అదే తీరున ఏపీలోనూ నిబంధనలను పక్కన పెట్టి నిర్మించిన వాటి మీద తాము కఠినంగా వ్యవహరిస్తామని పవన్ స్పష్టం చేశారు. పవన్ అన్న మాటలు చూస్తూంటే ప్రస్తుతం ఉన్న చట్టాలతోనే అక్రమ కట్టడాలను నియంత్రిస్తారా లేక కొత్తగా హైడ్రా తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేస్తారా అన్నది చర్చగా ఉంది.
ఇదిలా ఉంటే ఇటీవల విశాఖలో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా హైడ్రా ప్రస్తావన తెచ్చారు. ఏపీలో కూడా ఆక్రమణలను సరిచేయాలీ అంటే హైడ్రా తరహా వ్యవస్థను తేవాల్సిన అవసరం ఉంది అని అన్న్నారు. అయితే అదే విశాఖకు తరువాత వచ్చిన మంత్రి నారా లోకేష్ మాత్రం హైడ్రా అవసరం లేదని ప్రస్తుతం ఉన్న కఠినమైన చట్టాలతోనే ఆక్రమణలను నియంత్రించవచ్చును అని అన్నారు.
మరో వైపు చూస్తే పీసీసీ చీఫ్ షర్మిల కూడా ఏపీలో హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలని కోరడం విశేషం. వైసీపీ ఈ విషయంలో ఏమీ చెప్పలేదు. ఆ పార్టీ హైడ్రాను స్వాగతిస్తోందా లేదా అన్నది కూడా తెలియడంలేదు. ఏది ఏమైనా రాజకీయాలకు అతీతంగా బడాబాబులు అందరూ ఆక్రమణలలో ఉన్నారు అని అంటున్నారు.
దాంతో ఒక బలమైన వ్యవస్థ ద్వారానే ఇలాంటివి తీసి పక్కన పెట్టడం సాధ్యపడుతుంది అని అంటున్నారు. మునిసిపల్ చట్టాలు ఉన్నా కూడా వాటిలోని లొసుగులను ఆధారంగా చేసుకుని ఇంతదాకా తెచ్చారు. అందువల్ల ఒక సమధవంతమైన అధికారికి హైడ్రా లాంటి వ్యవస్థ బాధ్యతలు అప్పగించి చెరువులు కాలువలు గెడ్డలు ఏటి ఒడ్డున పరిసర ప్రాంతాలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారి ఆట కట్టించడమే బెటర్ అని అంటున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం సీరియస్ గానే ఆలోచన చేయాల్సి ఉంది అని అంటున్నారు.