ఓవర్ అవుతోందా స్వామీ...పవన్ ఎందుకలా ?
పవన్ కళ్యాణ్ తనకు కులం లేదు అని ఎంత చెప్పుకున్నా ఆయన ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు.
By: Tupaki Desk | 1 April 2025 2:45 AMజనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు. అది అందరికీ తెలిసిందే. ఆయన చుట్టూ కోట్లాది ఆశలు అల్లుకుని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తనకు కులం లేదు అని ఎంత చెప్పుకున్నా ఆయన ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. అందుకే ఆ సామాజిక వర్గం ఆయనని ఒక ఆశాకిరణంగా చేసుకుంది.
ఏపీలో కాపులకు సీఎం సీటు అన్నది అందని పండుగా ఉంది. ఏపీని రెండే రెండు కులాలు దశాబ్దాలుగా ఏలుతున్నాయి. కమ్మలు రెడ్లకే కీలకమైన సీఎం సీటు దక్కుతోంది. దాంతో కాపులు తమకంటూ ఒక పార్టీ ఉండాలని ఒక నాయకుడు ఉండాలని కలలు కన్నారు. మెగాస్టార్ గా వెండి తెర మీద ఒక వెలుగు వెలిగిన చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో కాపులు రెడ్ కార్పెట్ పలికారు.
అలా ఆయన ప్రజారాజ్యం పార్టీని 2009లో ఏర్పాటు చేస్తే చాలా మంది వెంట నడిచారు. కేవలం ఏపీలోనే 24 శాతం ఓటు షేర్ ని 18 సీట్లను తెచ్చుకుని ప్రజారాజ్యం బలమైన పార్టీగా నిలిచింది. కానీ చిరంజీవి దానిని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇక 2014లో జనసేనను పవన్ ప్రారంభించారు. దానికి కాపుల నుంచి మద్దతు లభించింది. ఆయన సొంతంగా 2019లో పోటీ చేస్తే ఆరు శాతం దాకా ఓట్లు వచ్చాయీ అది అందరి అభిమానమే అని అంటారు.
ఇక 2024లో పొత్తులు పెట్టుకుని జనసేన 21 సీట్లు సాధించింది. అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ అయ్యారు. ఇది ఎన్నికల వ్యూహం అని అనుకున్నా పవన్ మాత్రం ఎల్లకాలం చంద్రబాబు సీఎం గా ఉండాలని ఆయన వల్లనే ఏపీ అభివృద్ధి సాగుతుందని తరచూ చెప్పడమే ఇపుడు బలమైన సామాజిక వర్గంలో అసంతృప్తిని కలిగిస్తోంది అని అంటున్నారు.
నిన్నటికి నిన్న పీ 4 ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పవన్ మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు కాపులలో చర్చకు దారి తీస్తున్నాయని అంటున్నారు. మన వద్ద సత్తా లేనపుడు సత్తా సమర్ధత తెలివి తేటలు ఉన్న నాయకుడికి మద్దతు ఇవ్వాలని తాను అనుకున్నట్లుగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. బాబుకు మద్దతు ఇస్తేనే ఏపీకి ప్రయోజనం అని తాను 2014లో అనుకుని ఆ విధంగానే మద్దతు ఇచ్చాను అని పవన్ చెప్పారు.
ఈ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో అయితే చర్చ సాగుతోంది. సత్తా లేదని పవన్ ఒప్పుకున్నారా అన్న దాని మీద కూడా ఎవరికి వారుగా పాజిటివ్ గా నెగిటివ్ గా విశ్లేషిస్తున్నారు. నిజానికి పవన్ చాలా ఓపెన్ గా మాట్లాడారు. ఆయన చంద్రబాబు విజన్ గురించి తన మనసులో ఉన్న మాటను చెప్పారు.
కానీ రాజకీయాల్లో ఇలాంటివి ఎవరూ ఓపెన్ గా చెప్పరు. ఏ చిన్న రాజకీయ పార్టీ అయినా తమదే గొప్ప పార్టీ అంటుంది. తమ నాయకుడే గ్రేట్ అంటుంది. ఇక పవన్ వెనక ఉన్నది కోట్లాది మంది ఆశావహులు. వారంతా ఆయనను సీఎం గా చూడాలని అనుకుంటున్న సంగతి విధితమే. కానీ పవన్ మాత్రం మన వద్ద సత్తా లేదని అంటూ చేసిన వ్యాఖ్యలే వారిని బాధిస్తున్నాయని అంటున్నారు.
సత్తా లేదని ఎందుకు భావించాలి అన్నదే ఇపుడు అంతా అంటున్న విషయం. ఉమ్మడి ఏపీని విభజన ఏపీని ఏలిన అనేక మంది సీఎంలలో ఎవరి ఔట్ లుక్ వారికి ఉందని అంటున్నారు. ఎవరి ప్రాధాన్యతలు ప్రత్యేకతలు వారికి ఉన్నాయని చెబుతున్నారు. ఒక్కరే తెలివి తేటలు ఉన్నవారు అనుకుంటే వారే శాశ్వతంగా అధికారంలో ఉండాలి కదా అని అంటున్నారు.
బాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అని అలాగే వెల్ఫేర్ కి నాడు ఎన్టీఆర్, తరువాత వైఎస్సార్ అని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ తరానికి ప్రతినిధిగా తన విజన్ చూపించాలి కదా అని అంటున్నారు. ఎల్లకాలం టీడీపీనే పొగుడుతూ తాము పక్క వాయిద్యంగా ఉంటామని అంటే ఇక రాజకీయాలు ఎందుకు అన్న చర్చను లేవదీస్తున్నారు.
మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ ప్రతీ సందర్భంలోనూ చంద్రబాబుని అదే పనిగా పొగడటం కూడా నచ్చడం లేదని అంటున్నారు. ఎంత మిత్ర పక్షం అయినా పాలసీల మీదనే మాట్లాడితే బాగుంటుంది అని అంటున్నారు. ఇటీవల కాలంలో చూస్తే పవన్ అసెంబ్లీలో చంద్రబాబుని పొగిడారు, ఆ వెంటనే జరిగిన ఎమ్మెల్యేల కల్చరల్ మీట్ లో పొగిడారు. ఇపుడు చూస్తే పీ 4 కార్యక్రమంలో పొగిడారు.
ఇలా తరచూ పొగడడం వల్ల టీడీపీకి బాగానే ఉంది కానీ ఓవర్ అవుతోందని జనసేనను రాజకీయంగా అదే పలుచన చేస్తోందని అంటున్నారు. ఏపీలో అతి పెద్ద సామాజిక వర్గం ఆశలను ఆలోచనలను కూడా దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తే బాగుంటుంది అని అంటున్నారుట.