జనసేనకు ఇక.. వెయిటింగే ..!
వచ్చే పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారంటూ.. అసెంబ్లీలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి.
By: Tupaki Desk | 22 Nov 2024 3:30 AM GMTజనసేన నాయకులు మరో పదేళ్ల పాటు ఎదురు చూడాల్సిందే. అధికారం దక్కించుకునేందుకు.. తహ తహ లాడుతున్న ఆ పార్టీ నాయకులు.. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో నీరుగారి పోయారు. వచ్చే పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారంటూ.. అసెంబ్లీలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వయసు 53 సంవత్సరాలు. సో.. దీనికి పది సంవత్సరాలు జోడిస్తే.. ఆయనకు 63 ఏళ్ల వయసు వస్తుంది.
అప్పటి వరకు కూడా.. ముఖ్యమంత్రి పదవిని ఆయన ఆశించడం లేదన్న విషయం తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది. కానీ, పార్టీలో అంతర్గత చర్చలు, పార్టీ కేడర్ ఆశలను గమనిస్తే.. తమ వాడు ముఖ్యమంత్రి కావాలన్నది కాపు నాయకులు.. ఆ వర్గం నేతలు ఆశిస్తున్నారు. 2019లోనే తాను ముఖ్యమంత్రి కావాలని పవన్ కోరుకుంటున్నట్టు చెప్పారు. కానిస్టేబుల్ కుమారుడు ముఖ్యమంత్రి కాకూడదా? అని ప్రశ్నించడం ద్వారా.. జనసేన కేడర్ ఆశలను మరింత పెంచారు.
ఈ క్రమంలోనే 2019, 2024లోనూ జనసేన కేడర్ అంతా.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న పరిస్థితిని కళ్లకు కట్టింది. అందుకే రెచ్చిపోయి మరీ జనసేన నాయకులు పనిచేశారు. కానీ, పవన్ మాత్రం డిప్యూటీసీఎం పదవితో సరిపుచ్చుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడతారని లెక్కలు వేసుకున్నారు. కానీ, తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు.. పదేళ్ల వరకు తాను ఈ పదవిని కోరుకోవడం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఇది పార్టీ కేడర్‌ను తీవ్ర అసంతృప్తిలోకి నెట్టేస్తుందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముందుగా పార్టీని సమాయత్తం చేయకుండా.. పవన్ ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల.. కేడర్ నిరుత్సాహం లోకి జారుకుంటుందన్న సంకేతాలు వస్తాయన్నది విశ్లేషకుల మాట. అయితే.. జగన్ వంటి బలమైన నాయకుడిని మరోసారి అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా పవన్ అడుగులు వేస్తున్నారన్న చర్చ కూడా ఉండడం గమనార్హం. ఏదేమైనా.. జనసేన నాయకులు మాత్రం వెయిట్ చేయాల్సిందే. మరి ఏం జరుగుతుందో చూడాలి.