పవన్ కాకినాడ కామెంట్స్‌పై.. రియాక్షన్లు ఓకే.. ఇంతకీ ఏం చేస్తారు?
ఒకరకంగా చెప్పాలంటే కూటమి సర్కారులో తీవ్ర ప్రకంపనలు పుట్టించేవే.
By: Tupaki Desk | 1 Dec 2024 1:30 AM GMTకాకినాడ పోర్టులో పర్యటించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. రేషన్ బియ్య అక్రమ రవాణాపై నిప్పులు చెరిగారు. ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. తనను రాకుండా చేసేందుకు అధికారులు ప్రయత్నించారన్నారు. జిల్లా ఎస్పీ తాను రాగానే.. సెలవుపై వెళ్లారని చెప్పారు. ఇవన్నీ తేలిక విషయాలు కాదు. తేలిక పాటి విమర్శలు కూడా కాదు. ఒకరకంగా చెప్పాలంటే కూటమి సర్కారులో తీవ్ర ప్రకంపనలు పుట్టించేవే.
పవన్ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. రెండు మూడు రూపాల్లోని లోపాలను ఎత్తి చూపించారు. ఇవి అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి కూడా తగిలేవే. ఇక, పవన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, సీఎం చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ చేసిన సూచనలను స్వాగతిస్తున్నామని పురందే శ్వరి అన్నారు. వీటిని పరిశీలిస్తామన్నారు. ఇక, అనంతపురంలో పర్యటించిన చంద్రబాబు.. అక్కడ పింఛన్ల పంపిణీ అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించారు.
అయితే.. నేరుగా చంద్రబాబు పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించకుండా.. రేషన్ బియ్యం అక్రమాలపై నిప్పు లు చెరిగారు. గత వైసీపీ హయాంలోనే రేషన్ బియ్యం మాఫియా పెరిగిపోయిందని చెప్పారు. విచ్చల విడిగా రేషన్ బియ్యం తరలి పోతోందని, దీనికి అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకరకంగా చెప్పాలంటే.. అటు బీజేపీ, ఇటు టీడీపీ అగ్రనాయకులు పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు బాగానేఉంది. కానీ, కార్యాచరణకు వచ్చే సరికి ఏం జరుగుతుందన్నది ప్రశ్న.
1) పోర్టులో లోపాలను పవన్ ఎత్తి చూపించారు. ఇది కేంద్ర ప్రబుత్వ పరిధిలోని అంశం. పైగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర ఎంపీలు ప్రయత్నించాలి. అది సాధ్యమేనా?
2) తనను రావొద్దంటూ..అధికారులే అడ్డుకున్నారని పవన్ చెప్పారు. ఈ అధికారులు రాష్ట్ర సర్కారులో ఉన్నారు మరి వీరిపై యాక్షన్ తీసుకుంటారా? అనేది ప్రశ్న. ఈ విషయాన్ని ఎవరూ చెప్పడం లేదు.
3) రేషన్ అక్రమాల వ్యవహారంలో ఇప్పుడు కూటమి పార్టీలకు చెందిన నాయకుల పాత్రే ఉందని స్థానికంగా వినిపిస్తున్న మాట. వారిని కట్టడి చేయడం సాధ్యమేనా? అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పవన్ వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడి సరిపుచ్చుకుంటారో.. చర్యలకు దిగుతారో చూడాలి.