Begin typing your search above and press return to search.

'వారిపై కఠిన చర్యలు తీసుకోండి'... పోలీసులకు కీలక ఆదేశాలు!

ఈ సమయంలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు పవన్.

By:  Tupaki Desk   |   23 Nov 2024 4:20 AM GMT
వారిపై కఠిన చర్యలు తీసుకోండి... పోలీసులకు కీలక  ఆదేశాలు!
X

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాలనలో తనదైన దూకుడు కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. తన దృష్టికి వచ్చినా ఏ విషయంపై అయినా ఆయన సీరియస్ గానే స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని విషయాల్లో ఆయనే నేరుగా రంగంలోకి పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు పవన్.

అవును... తనకు అందుతున్న ఫిర్యాదులపై పవన్ కల్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. మరికొన్ని వ్యవహారాల విషయంలో నేరుగా ఆయనే ఎంట్రీ ఇస్తున్నారు. నేరుగా సంబంధిత ప్రదేశానికి వెళ్లి విషయం తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో... తనకు ఇటీవల అందిన ఫిర్యాదులపై పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో భాగంగా... రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని.. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు.

తనకు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ సంఖ్యలో కాకినాడతో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చాయని చెప్పిన పవన్... అన్ని జిల్లాల కలెక్టర్లు, కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నివేదికలకు ప్రాధాన్యం ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లు, ఎస్పీలను కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

ఇక.. నాలుగు దశాబ్ధాల నాటి ఫ్రేం వర్క్ ను సమగ్రంగా మార్చేదిగా తమ ఎన్డీయే కూటమి ప్రభుత్వ పరిపాలన ఉంటుందని చెప్పిన పవన్... ఇందులో భాగంగనే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధ) చట్టాన్ని తెచ్చిందని అన్నారు. ఈ కొత్త చట్టంలో బాధితుల పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉంటాయని తెలిపారు.

ఇదే సమయంలో... మెరుగైన భూ రికార్డులు, టైటిల్ వెరిఫికేషన్, నివారణ చర్యలు, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ, కఠినమైన జరిమానాలు ఉంటాయని స్పష్టం చేశారు. భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్సించడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.