Begin typing your search above and press return to search.

సీఎం పదవిపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

21 అసెంబ్లీ స్థానాల్లో, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాలను గెలుచుకుంది.

By:  Tupaki Desk   |   28 Sep 2024 7:01 AM GMT
సీఎం పదవిపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు
X

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో జనసేన పార్టీకి 100 శాతం ఫలితాలను అందించి దేశంలో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయదుందుభి మోగించిన ఏకైక పార్టీగా జనసేన జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాలను గెలుచుకుంది.

ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన అభిమానులు, జనసేన పార్టీ నేతలు, శ్రేణుల కల సగం నెరవేరింది. కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలకు మంత్రిగా పవన్‌ ఉన్నారు.

ఎన్నికల్లో గెలిచాక పవన్‌ పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. తన మంత్రిత్వ శాఖలపై పట్టు సాధించే పనుల్లో ఉన్నారు. వరుసగా ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అప్పటికప్పుడు, వీలైనంత తొందరగా పూర్తయ్యే పనులకు పవన్‌ కళ్యాణ్‌ ప్రాధాన్యతనిస్తున్నారు. పవన్‌ ఆదేశాల మేరకు అధికారులు కూడా యుద్ధప్రాతిపదికన ప్రజలకు అవసరమైన పనులు చేపడుతున్నారు.

కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిపై తన మనసులో మాటను కుండబద్దలు కొట్టారు. ఆ పదవిపై తనకు ఎలాంటి ఆకాంక్ష లేదన్నారు. తాను సినిమా నటుడిని కావాలని అనుకోలేదని.. అయినా అయ్యానని గుర్తు చేశారు. అలాగే డిప్యూటీ సీఎంను కావాలని కోరుకోలేదన్నారు. అయినా ఇప్పుడు ఆ పదవిలో ఉన్నానని చెప్పారు.

తాను తన జీవితంలో ఏ పదవిని, అధికారాన్ని ఆశించలేదని పవన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. సినీ నటుడిని, రాజకీయ నాయకుడిని కావాలని అనుకోలేదన్నారు. నా దేశం కోసం పనిచేయడం తనకిష్టమన్నారు. అదే పని కోసం ఇప్పుడు ఇక్కడ (రాజకీయాల్లో) ఉన్నానని చెప్పారు. దేశం కోసం నిలబడటమే తప్ప ఈ అధికార స్థానాలు తనను ఉత్తేజపర్చవని పవన్‌ కుండబద్దలు కొట్టారు.

సీఎం పదవికి చంద్రబాబే సరైన వ్యక్తి అని తనకు అనిపించిందని పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అనుభవం అమూల్యమైందన్నారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆయన అనుభవం ఉపయోగపడుతుందన్నారు. సీఎంగా చంద్రబాబును మించినవారు లేరని పవన్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పుడే కాదు రాబోయే కాలంలోనూ ఆ పదవి చేపట్టాలన్న కోరిక తనకు లేదన్నారు. టీడీపీలో సుదీర్ఘ సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

సీఎం పదవిపై పవన్‌ వ్యాఖ్యలు ఎలా ఉన్నా ఆయనను ఆ పదవిలో చూసుకోవాలనుకుంటున్నా ఆయన అభిమానులు, కాపు సామాజికవర్గం, జనసేన పార్టీ శ్రేణులు మాత్రం ఆయన వ్యాఖ్యలను ఇష్టపడరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2029 ఎన్నికల్లో పవన్‌ కళ్యాణే సీఎం అని ఇప్పటి నుంచే సందడి చేస్తున్న ఆ వర్గాలకు పవన్‌ మాటలు రుచిస్తాయా?!

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనే చాలా తక్కువ సీట్లు తీసుకున్నారని పవన్‌ అభిమానులు, జనసేన వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. బహిరంగంగానే సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. మంత్రి పదవుల్లోనూ కేవలం మూడే తీసుకోవడంపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి తాను ముఖ్యమంత్రిని కాకుండా చంద్రబాబునే ముఖ్యమంత్రిగా చూసుకోవడం ఇష్టమంటే అభిమానుల అసంతృప్తి జ్వాలలను పవన్‌ ఆర్పగలరా?!