పవన్ అన్ స్టాపబుల్ ఆర్నెల్లలో ఏం చేశారంటే..
వంద శాతం స్ట్రైక్ రేటుతో గెలిచిన జనసేనాని పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చాక అంతే సమర్థంగా పనిచేస్తున్నారు.
By: Tupaki Desk | 12 Jan 2025 2:18 PM GMTసినీ హీరోగా ఎన్నో హిట్స్ సొంతం చేసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నారనే ప్రశంసలు అందుకుంటున్నారు. ఒక్కచాన్స్ ఇస్తే తానేంటో నిరూపించుకుంటానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తన పనితీరుతో అభినందనలు అందుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో తన శాఖను సమర్థంగా నిర్వహిస్తున్న పవన్ వైసీపీ ఐదేళ్లలో సాధించలేని, చేయలేని పనులు చేశారంటున్నారు.
వంద శాతం స్ట్రైక్ రేటుతో గెలిచిన జనసేనాని పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చాక అంతే సమర్థంగా పనిచేస్తున్నారు. కూటమిలోని మిగతా మంత్రులు కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం క్రియేట్ చేసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న పవన్ ప్రజా సమస్యల పరిష్కారానికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన శాఖకు లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని అందుకునేలా సమగ్ర విధానాలు అమలు చేస్తున్నారు. పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్న పవన్ భవిష్యత్తులో తనను అందుకునే నాయకుడు ఎవరూ లేనంత స్థాయికి ఎదగాలనే పట్టుదల ప్రదర్శిస్తున్నట్లు రాజకీయల విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీపడుతున్న ఉప ముఖ్యమంత్రి తనకు అప్పగించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. తన శాఖ పరిధిలో చేపట్టాల్సిన పనులను ఈ ఆరు నెలల్లో చాలావరకు పూర్తి చేశారు. అటవీ భూముల పరిరక్షణతోపాటు ప్రభుత్వపరంగా ఇతర శాఖల్లో చోటుచేసుకుంటున్న వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. దీంతో పవన్ పనితీరు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ చేపట్టిన వినూత్న కార్యక్రమం పల్లె పండగ. ఈ కార్యక్రమం కింద ఆరు నెలల్లో 3,750 కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కేవలం 1800 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తే, పవన్ ఆరు నెలల్లో రికార్డు స్థాయి పనులు చేయించారు. పవన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయానికి పీఆర్లో నిధులు లేక పంచాయతీల నిర్వహణ కష్టంగా ఉండేది. కానీ, ఆరు నెలల కాలంలో ప్రభుత్వం నుంచి తన శాఖకు వేల కోట్లు నిధులు తెచ్చుకున్న పవన్ ప్రతిపైసా సద్వినియోగమయ్యేలా పనులు చేయించారు. అదేవిధంగా తన శాఖ పరిధిలో రైతులకు మేలు జరిగేలా మినీ గోకులాలను నిర్మించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో కేవలం 268 మినీ గోకులాలు నిర్మిస్తే.. ఈ ఆరు నెలల్లో పవన్ 12,500 గోకులాలు నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా పాడి రైతులకు పశువులు అందజేసి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీసేలా పావులు కదుపుతూ రాష్ట్రంలో తన ఇమేజును మరింత పెంచుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో సరస్వతీ పవర్ ప్రాజెక్టు పేరిట అటవీ భూములు తీసుకున్నారని వార్తలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నారు పవన్. అదేవిధంగా కడప జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలపైనా పవన్ యాక్షన్ ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టింది.
అధికారంలోకి వచ్చిన తొలిసారే సమర్థ పనితీరుతో ఆకట్టుకుంటున్న పవన్.. జనసేన అధినేతగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో తన బాధ్యతలను గుర్తు చేసుకుంటూ హోంశాఖతోపాటు పౌరసరఫరా శాఖల్లో చోటుచేసుకున్న సంఘటనలపై పవన్ స్పందించిన తీరు విపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీంతో ఆయన గేమ్ ఛేంజర్గా పేరుతెచ్చుకున్నారు. పవన్ జోక్యంతోనే సోషల్ మీడియా అరెస్టులు, రేషన్ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకోవడం వంటివి జరగడం పవన్ స్థాయిని పెంచాయంటున్నారు. మొత్తానికి తనను తాను మెరుగుపరుచుకుంటూ ప్రభుత్వంలో తిరుగులేని ముద్ర వేస్తున్న పవన్ భవిష్యత్తులో తనను ఎవరూ టచ్ చేయలేని స్థితికి చేరారనే ప్రశంసలు అందుకుంటున్నారు.