పవన్ ని బ్రహ్మరధం...మహాభిమానం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో అపరిమితమైన జనాభిమానం ఉంది. ఆయనకు అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
By: Tupaki Desk | 17 Nov 2024 3:21 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో అపరిమితమైన జనాభిమానం ఉంది. ఆయనకు అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. పవన్ చరిష్మా ఏంటి అన్నది అందరికీ తెలుసు. పవన్ అంటే పడి చచ్చేంత ఆదరణ తెలుగు వారికే సొంతం.
అయితే పవన్ హిందీ బెల్ట్ లోకి ప్రవేశించి ఇంతకు ఇంత ఆదరణను అభిమానాన్ని చూరగొనడం మాత్రం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. పవన్ ఎన్డీయే కూటమి అభ్యర్ధులకు మద్దతుగా మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు రోజుల పాటు ప్రచారానికి వెళ్లారు. ఆయనకు అక్కడ అడుగడుగునా జనాలు నీరాజనాలు పలికారు.
నేల ఈనిందా ఆకాశం చిల్లుపడిందా అన్నట్లుగా పవన్ కళ్యాణ్ కి జనాలు విరగబడి మరీ వచ్చి ఘనస్వాగతం పలికారు. అంతే కాదు కనుచూపు మేరలో ఎక్కడా నేల మీద ఇసుక వేస్తే రాలనంతగా జనాలు తరలివచ్చారు. దాంతో హిందీ బెల్ట్ లో పవన్ కళ్యాణ్ చర్మిష్మాను చూసిన జాతీయ స్థాయి పార్టీలు నేతలు ముక్కున వేలేసుకునే పరిస్థితి.
ఆఫ్ కోర్స్ పవన్ టాలీవుడ్ లో అగ్ర నటుడు. అయితే ఆయన పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేయలేదు. ఆయన సినిమాలు హిందీలో డబ్ అయితే అయి ఉండొచ్చు. అంతే కానీ నేరుగా ఆయన హిందీలో నటించలేదు. కానీ పవన్ మానియా మాత్రం ఎక్కడ చూసినా కనిపిస్తోంది అంటే ఆయన క్రేజ్ మామూలుగా లేదు అనే అంటున్నారు.
ఇక్కడ రెండు విధాలుగా పవన్ క్రేజ్ కనిపిస్తోంది. ఒకటి ఆయన టాలీవుడ్ హీరోగా ఉంటూ సంపాదించుకున్న ఇమేజ్ అయితే రెండవది జనసేన అధినేతగా పదేళ్ల పాటు ఏపీలో చేసిన పోరాటం ఫలితంగా ఆయన సంపాదించుకున్న పొలిటికల్ ఇమేజ్ అని చెప్పాలి.
అందుకే పవన్ చూసేందుకు ఆయన మాటలు వినేందుకు జనాలు ఎగబడ్డారు. ఇక పవన్ కోసం జనాలు పడిగాపులు కాయడం, ఆయన ప్రచారం రధం వెంట పరుగులు తీయడం ఈ సన్నివేశాలు అన్నీ చూసిన వారికి ఏపీలో ఉన్నామా లేక మహారాష్ట్రలో ఉన్నామా అన్న భావన అయితే తప్పనిసరిగా కలుగుతోంది.
ఇక పవన్ కి షోలాపూర్ సిటీలో లభించిన ఆదరణ చూస్తే నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంది. పవన్ సైతం తనకు లభిస్తున్న అదరణను చూసి ఉప్పొంగిపోయారు. ఆయన కూడా పదునైన ప్రసంగాలు చేస్తూ జనాదరణను చూరగొన్నారు. మొత్తానికి చూస్తే అప్పట్లో ఎన్టీఆర్ హిందీ రాష్ట్రాల ప్రచారానికి వెళ్ళినపుడు ఆయన కోసం కూడా ఇలాగే జనాలు వెంటబడేవారు.
ఇపుడు పవన్ కోసం కూడా జనాలు తోసుకుంటూ రావడం చూస్తే కనుక పవన్ జాతీయ స్థాయి నేతగా తొందరలోనే ఎమర్జ్ అయ్యే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయనే అంటున్నారు. ఆయనకు ఉన్న ఆ ప్రజాకర్షణ ఈ రోజు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ లాంటి ఒకరిద్దరికి తప్ప ఎవరికీ లేదని కూడా చెప్పాల్సి ఉంది. సో పవన్ ను ఆయన క్రేజ్ ని చూస్తే వామ్మో అనుకోవాల్సి వస్తోంది. ఏది ఏమైనా పవన్ కి రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని షోలాపూర్ సభను చూస్తే అర్ధం అవుతోంది.