Begin typing your search above and press return to search.

తమిళనాడుకు పవన్ షాక్... నెటిజన్ల "ఊసరవెల్లి" కామెంట్స్ వైరల్!

కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ "జయకేతనం"లో పవన్ కల్యాణ్ ప్రసంగం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   15 March 2025 10:57 AM IST
తమిళనాడుకు పవన్  షాక్... నెటిజన్ల ఊసరవెల్లి కామెంట్స్  వైరల్!
X

కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ "జయకేతనం"లో పవన్ కల్యాణ్ ప్రసంగం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఈ సందర్భంగా పార్టీ ప్రస్థానం, ఎదుగుదల, నిలబడిన విధానం గురించి వివరిస్తూ.. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ఫ్యూచర్ పై క్లారిటీ ఇస్తూనే.. జాతీయ అంశాలపైనా పవన్ కుండబద్దలు కొట్టారు.

అయితే... గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు తాజా వ్యాఖ్యలు పూర్తి భిన్నమైనవైనప్పటికీ.. తాజాగా ఉప ముఖ్యమంత్రి హోదాలో, బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న పార్టీకి అధినేతగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయని అంటున్నారు. ఇందులో ప్రధానంగా హిందీ భాష పేరు చెప్పి తమిళులపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును... ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి - తమిళనాడుకు మధ్య హిందీ భాషపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తున్నారంటూ పార్టీలకు అతీతంగా మెజారిటీ తమిళులు మండిపడుతున్నారని అంటున్నారు. పార్టీలుగా వేరైనా.. భాషాభిమానం విషయంలో తగ్గేదేలే అంటున్నారని అంటున్నారు.

అలాంటి పరిస్థితుల్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్.. తమిళులపై కీలక వ్యాఖ్యలు చేశారు! ఇందులో భాగంగా... దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ తమిళులు మాట్లాడుతున్నారు.. అలాంటప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్బింగ్ చేయొద్దు.. మీకు డబ్బులేమో యూపీ, బీహార్ నుంచి కావాలా? హిందీ మాత్రం వద్దా? అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో ఇటీవల.. తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో రూపాయి సింబల్ ను తొలగించి.. ఆ స్థానంలో "రూ" అనే అర్ధం వచ్చేలా తమిళ అక్షరాన్ని చేర్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైనా స్పందించిన పవన్... రూపాయి సింబల్ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవడం ఏమిటి? వివేకం, ఆలోచన ఉండోద్దా? అంటూ నిలదీశారు.

దీంతో... ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. ఈ సమయంలో... గతంలో "హిందీ గో బ్యాక్" అనే నినాదానికి పవన్ ఇచ్చిన మద్దతు, చేసిన ట్వీట్లు, దినపత్రిక క్లిప్పింగులను నెటిజన్లు తవ్వి తీస్తున్నారు. వాటిని ట్రెండ్ చేస్తోన్నారు. ఈ సందర్భంగా #Chameleon (ఊసరవెల్లి) అని వైరల్ చేసే పనిలో ఉన్నారు!

ఇదే సమయంలో... గతంలో దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ చేసిన విమర్శలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు! తిరుమల తిరుపతి దేవస్థానం కార్వనిర్వహణాధికారిగా తెలుగేతర సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించినప్పుడు ఆయన తప్పుబట్టిన విషయాన్ని ప్రస్థావిస్తోన్నారు.