పవన్ కాషాయం...వారికి కంపరంగా ఉందా ?
ఆ మాటకు వస్తే ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పూర్తిగా కాషాయ వస్త్రాలతోనే తన రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ వస్తున్నారు.
By: Tupaki Desk | 16 Feb 2025 3:53 AM GMTఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి దైవ భక్తి ఎక్కువ. ఆయన అనేక సార్లు దానిని చాటుకుంటూనే ఉన్నారు. ఆయన తనకు వీలు చిక్కినప్పుడల్లా దీక్షలు చేస్తారు. ఆయన ఏడాదిలో ఎక్కువ సమయం ఆ విధంగా పవిత్ర వస్త్రాలలో కనిపిస్తారు. ఆ మాటకు వస్తే ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పూర్తిగా కాషాయ వస్త్రాలతోనే తన రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ వస్తున్నారు.
రాజకీయ నేతలకు ప్రభుత్వంలో పనిచేసే వారికి డ్రెస్ కోడ్ అన్నది ప్రత్యేకంగా లేదు అన్నది తెలిసిందే. ఇక వారి ఇష్టాలను బట్టి వస్త్రధారణ ఉంటుంది. అది వారికి ఉన్న స్వేచ్చ కూడా. ఇక పవన్ కళ్యాణ్ తాజాగా దక్షిణాదిన ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. ఆయన నాలుగు రోజుల పాటు కేరళ, తమిళనాడు కి వెళ్ళి అక్కడ దేవాలయాలను సందర్శించారు. పూజలు కూడా చేశారు.
దీని మీద ఎర్రన్నలు గుర్రుమంటున్నారు. పవన్ కాషాయ వస్త్రాలు ధరించి గుళ్ళూ గోపురాలు తిరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయం మీద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నిశితమైన విమర్శలు చేశారు. ప్రశ్నిస్తాను అని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇపుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలా చేయడం తగునా అని అంటున్నారు.
హిందూ ధర్మంలో ఆలయ సందర్శన అన్నది ఉందని అయితే రిటైర్డ్ అయిన వారు తమ శేష జీవితాన్ని గడపడానికి అలా చేస్తారు అన్నారు. పవన్ చూస్తే ఉప ముఖ్యమంత్రి అలాగే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆయన ప్రభుత్వంలో ఉంటూ పాలించాల్సింది పోయి ఈ విధంగా చేయడమేంటని నిలదీస్తున్నారు.
పవన్ ఆలయాలు తిరగడానికా ఉప ముఖ్యమంత్రి పదవి అని ప్రశ్నించారు. ఆయనకు ఆధ్యాత్మిక భావన అధికంగా ఉంటే ఉప ముఖ్యమంత్రి పదవికి బదులుగా దేవాదాయ శాఖ పదవిని తీసుకుని ఎంచక్కా గుడులలోనే పర్యటించవచ్చునని సూచించారు. ఏపీని అదానీకి దోచి పెడుతున్నారని ఈ విషయంలో పవన్ ప్రశ్నించరా అని ఆయన నిలదీశారు. ప్రభుత్వంలో ఏమి జరిగినా తాను మౌనంగానే ఉంటాను అంటే కనుక పవన్ సైతం ఈ దోపిడీని సమర్ధిసున్నట్లుగానే భావించాల్సి ఉంటుందని రామక్రిష్ణ అన్నారు.
మరో వైపు చూస్తే పవన్ కాషాయ వస్త్రాలతో ఏపీలో కనిపించడం కమ్యూనిస్టులకు ఇబ్బందిగా ఉందా అన్న చర్చ నడుస్తోంది. స్వతహాగా కమ్యూనిస్టులది లెఫ్టిస్ట్ ఐడియాలజీ. బీజేపీది రైటిస్టు ఐడియాలజీ. అందువల్ల వామపక్షాలు బీజేపీని తప్పు పడుతూంటారు. బీజేపీవి మత రాజకీయాలని విమర్శిస్తూంటారు. ఇక చూస్తే కనుక జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. పైగా పవన్ ఇటీవల కాలంలో సనాతన ధర్మం అని గట్టిగా మాట్లాడుతున్నారు.
ఆయన కూడా బీజేపీ భావజాలాన్ని అలవరచుకుంటున్నారా అన్నదైతే ఎర్రన్నల్లో ఉందని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో బీజేపీతో కలసి సాగుతోంది. అలాగే కేంద్రంలో బీజేపీ అప్రతిహత విజయాలు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల మీద పోరాడుతున్నా వామపక్షాలు తమ సిధాంతాలకు భిన్నంగా ఉండే భావజాలాన్ని కూడా గట్టిగా ప్రశ్నిస్తూంటారు అని అంటున్నారు.