పవన్ ముందు చూసుకోవాల్సింది ఇదే కదా !
తాజాగా ఒక తమిళ మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన పార్టీ జనసేనను తమిళనాడులో విస్తరిస్తామని చెప్పారు.
By: Tupaki Desk | 26 March 2025 10:30 PMజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సినీ గ్లామర్ నిండుగా ఉంది. దాంతో ఆయనకు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అభిమానులు విపరీతంగా ఉన్నారు. దాంతో ఆయన ఆ సినీ సందోహాన్ని చూసుకుని మురిసిపోతూంటారు. తాజాగా ఒక తమిళ మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన పార్టీ జనసేనను తమిళనాడులో విస్తరిస్తామని చెప్పారు.
ఆయన ఎందుకు ఆ మాట అన్నరో కానీ దాని మీద చర్చ అయితే సాగుతోంది. పవన్ పార్టీని తమిళనాడులో విస్తరిస్తే మంచిదే కానీ దాని కంటే ముందు ఏపీలో చూసుకోవాలి కదా అన్న సూచనలు వెలువడుతున్నాయి. ఏపీలో జనసేన 21 సీట్లకు పోటీ చేసి గెలిచింది అన్నది వాస్తవం.
అయితే అక్కడ టీడీపీ మద్దతుతో అన్నది మరవరాదు అని అంటున్నారు. ఇక అధికారంలోకి వచ్చాక జనసేన ఎమ్మెల్యేల కంటే లోకల్ టీడీపీ నేతల ప్రాబల్యం అక్కడ నియోజకవర్గాలలో అధికంగా ఉంటోంది అన్నది కూడా ఉంది. ఇటీవల జనసేన ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకుని మరీ తమ బాధను వెళ్ళగక్కారని కూడా ప్రచారం సాగింది.
మరో వైపు చూస్తే పవన్ కి జనసేనకు అండగా అభిమానులు బలమైన సామాజిక వర్గం ఉన్నారు. ఇక గోదావరి జిల్లాలలో జనసేన కోసం కొమ్ము కాసిన రాజకీయ భీష్ముడు మాజీ మంత్రి హరి రామజోగయ్య అయితే కాపుల కోసం కూటమి ప్రభుత్వం ఏదైనా చేయాలని కోరుతున్నారు. అంతే కాదు ఉభయ గోదావరి జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టాలని లేఖలు రాస్తున్నారు.
మరో వైపు చూస్తే జనసేన మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ బలంగా ఉండాల్సి ఉంది. ఆ మేరకు పార్టీని విస్తరించాల్సి ఉంది. అధికారంలో లేక పదేళ్ళ పాటు పార్టీ విస్తరణ అన్నది జరగలేదు ఇపుడు అధికారంలోకి వచ్చి పది నెలలు అయింది. ఇపుడు అయినా సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సి ఉందని అంటున్నారు
తెలంగాణాలో కూడా తెలుగు వారు ఉన్నారు. పవన్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అక్కడ బలమైన సామాజిక వర్గం ఉంది. కానీ అక్కడ కూడా జనసేన తన ప్రభావం పెద్దగా చూపించలేకపోయింది అన్నది గత సార్వత్రిక ఎన్నికలు తెలియచేశాయి.
అలాంటిది సెంటిమెంట్ కి ఆటపట్టు అయిన తమిళనాడులో జనసేన ఏ మేరకు ఆదరణ పొందుతుంది అన్నది చర్చగా ఉంది. పవన్ కి జాతీయ స్థాయిలో రాణించాలని కోరిక ఉందని జనసేన ఆవిర్భావ సభ ద్వారా ఆయన బహుళ భాషలలో చేసిన ప్రసంగం ద్వారా వెల్లడి అయింది. అయితే ఆయన పార్టీని ముందు ఏపీలో చక్కదిద్దుకోవాల్సి ఉందని అంటున్నారు.
ఈ రోజుకీ ఏపీలో టీడీపీ అతి పెద్ద పార్టీగా ఉంటే వైసీపీ రెండవ ప్లేస్ లో ఉంది. జనసేన కూడా తన పార్టీని ఏపీలో పటిష్టం చేసుకోవాలని అంటున్నారు. దేశంలో ఎవరైనా పార్టీని విస్తరించుకోవచ్చు. ముందు ఉన్నచోట గట్టిగా నిలబడితే వాటంతట అవే జరుగుతాయని అంటున్నారు.
ఏది ఏమైనా పవన్ ఆలోచనలు బాగానే ఉన్న సొంత ఇల్లు లాంటి ఏపీలో ముందు పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచనలు వెలువడుతున్నాయి. 21 సీట్లు గెలిచినంత మాత్రన అది సంబరం కాదని గతానికి కంటే కొంత మంచి విజయంగా చూడాలి తప్పించి ఇంతటితో అంతా అయిపోయింది అని అనుకోరాదని అంటున్నారు. సో జనసేనాని తమిళం వైపు చూడడానికి ఇంకా చాలా సమయం ఉందనే అంటున్నారు.