జగన్ ఇలాకాలో పవన్...ఫస్ట్ టైమ్ అలా !
ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఫస్ట్ టైమ్ కడప గడపకు చేరుకుంటున్నారు.
By: Tupaki Desk | 5 Dec 2024 11:30 PM GMTజనసేన అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడప జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆయన గతంలో కడపకు ఎన్నో సార్లు వచ్చినా ఈసారి వచ్చేది మాత్రం అధికారిక కార్యక్రమం కోసం. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఫస్ట్ టైమ్ కడప గడపకు చేరుకుంటున్నారు.
దాంతో జగన్ ఇలాకాలో పవన్ ఈ విధంగా అధికార హోదాతో రావడంతో రాజకీయంగా అంతా ఆసక్తిని చూపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 7న కడప జిల్లాకు రానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఆయన ఆ రోజున హైదరాబాద్ నుంచి బయలుదేరి డైరెక్ట్ గా కడప ఎయిర్ పోర్టులో దిగుతారు. అక్కడ నుంచి ఆయన కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగులో పాల్గొంటారు అని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి అయితే ఉప ముఖ్యమంత్రి కడప జిల్లా షెడ్యూల్ ఇదే అని తెలుస్తోంది.
ఈ కార్యక్రమం పూర్తి అయిన తరువాత పవన్ కళ్యాణ్ జిల్లాలోని జనసేన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు అని అంటున్నారు. ఆ తరువాత ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పర్యటనకు వస్తుండటంతో అధికార యంత్రాంగం పెద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ని చూసేందుకు అభిమాన జనం భారీగా తరలివస్తుందని అంచనాలు ఉన్నాయి. దాంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి పర్యటన కోసం గట్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చి వైసీపీ అధినేత జగన్ మీద విమర్శలు చేశారు. ఇపుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ హోదాలో ఆయన కడపలో వైసీపీ అధినాయకుడి మీద ఏ విధమైన విమర్శలు చేస్తారు అన్న చర్చ సాగుతోంది. అయితే ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి విద్య గురించి ఎక్కువగా పవన్ చెబుతారని అంటున్నారు.
అదే సమయంలో గత ప్రభుత్వం వైఫల్యాలను ఆయన ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే జగన్ ఇలాకాలో పవన్ అధికారిక హోదాలో కాలు పెట్టడమే అతి పెద్ద సంచలనం కాబట్టి ఆ రోజున అందరి చూపూ కడప వైపే ఉంటుందని అంటున్నారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజున బాపట్లలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగులో పాల్గొంటారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా వేరే చోట అటెండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంది అని అంటున్నారు. దాంతో విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అన్నది కూడా తెలుసుతుంది అని అంటున్నారు.