పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్ చల్ డిప్యూటీ సీఎం భద్రతపై టెన్షన్!
ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం వెంట ఓ నకిలీ ఐపీఎస్ అధికారి ఉండటం ఆలస్యంగా వెలుగు చూసింది.
By: Tupaki Desk | 28 Dec 2024 3:47 PM GMTఏపీ డిప్యూటీ సీఎం పవన్ భద్రత ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం సంచలనంగా మారింది. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం వెంట ఓ నకిలీ ఐపీఎస్ అధికారి ఉండటం ఆలస్యంగా వెలుగు చూసింది. వై కేటగిరీ భద్రత కలిగిన పవన్ కాన్వాయ్ లో ఆ నకిలీ ఐపీఎస్ కారుతో తిరగడమే కాకుండా, పవన్ పర్యటన భద్రత ఏర్పాట్లు చూసిన పోలీసులతో కలిసి సెల్ఫీలు దిగడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన పవన్ పల్లె పండుగలో భాగంగా గిరిజన గ్రామాల్లో రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఒడిశా ఆంధా సరిహద్దుల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పవన్ పర్యటించడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు ఎంతలా జాగ్రత్తలు తీసుకున్నా, ఓ నకిలీ ఐపీఎస్ అధికారి పవన్ పర్యటనలో డిప్యూటీ సీఎం వెంటే తిరగడం ఆలస్యంగా వెలుగుచూసింది. విజయనగరం జిల్లా మెరకముడిదాం గ్రామానికి చెందిన బలివాడ సూర్యప్రకాశ్ మాజీ సైనికుడు. ప్రస్తుతం గరివిడి పట్టణంలో నివసిస్తున్నాడు. ఆయన తండ్రి తూనికలు, కొలతల శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. సైన్యంలో పనిచేసి వచ్చిన తర్వాత సూర్యప్రకాశ్ నకిలీ పోలీసుల అవతారం ఎత్తాడు. కొన్నాళ్లుగా తాను ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటూ స్థానికంగా తిరుగుతున్నాడు. మాజీ సైనికుడు కావడంతో స్థానికులు కూడా ఐపీఎస్ వచ్చిందేమోనని నమ్మేశారు. దీంతో ఆయన అడిగిన వెంటనే కొందరు కార్లు సమకూర్చారు. విశాఖ, హైదరాబాద్ లో ఉంటూ అప్పుడప్పుడు తన స్వస్థలానికి వచ్చే నిందితుడు సూర్యప్రకాశ్ గత వారం పర్యటన సమయంలో గరివిడి వచ్చి, పవన్ భద్రత విధులు ఉన్నాయని ఓ కారు అద్దెకు తీసుకున్నాడు. పోలీసు గెటప్ లో సాలూరు వెళ్లి పవన్ పర్యటనలో ఆయన వెంటే తిరిగాడు.
ఆయన యువ ఐపీఎస్ అధికారి అని పొరపడిన కొందరు పోలీసులు నిందితుడితో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో అతడు నకిలీ పోలీసు అన్న విషయం వెలుగుచూసింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న మక్కువ పోలీసులు.. తమ మార్కు విచారణ చేస్తున్నారు. సూర్యప్రకాశ్ ఏ ఉద్దేశంతో పవన్ పర్యటనకు వచ్చాడు? నిందితుడు ఆలోచన ఏంటి? ఎవరైనా చెబితే వచ్చాడా? లేక ఈ ఫొటోలు అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేయాలని ప్లాన్ చేశాడా? అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వై కేటగిరీ భద్రత పొందుతున్న డిప్యూటీ సీఎం కాన్వాయ్ లో ఓ నకిలీ పోలీసు చొరబడటం, అందునా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.