పవన్ వెర్సస్ డీఎంకే.. పెద్ద రచ్చే
ఐతే సోషల్ మీడియా పవన్, జనసేన అభిమనులు ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
By: Tupaki Desk | 6 Oct 2024 8:30 PM GMTజనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయం ఇప్పటిదాకా ఏపీ చుట్టూనే తిరిగింది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పవన్ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన ఇటీవల తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం ఒక వైరస్ అంటూ డీఎంకే నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆయన మీద పరోక్ష విమర్శలు గుప్పించారు. దీంతో డీఎంకే నేతలు పవన్ మీద ప్రతి విమర్శలు మొదలుపెట్టారు. ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పవన్‌ను టార్గెట్ చేయడమూ కనిపిస్తోంది. ఐతే సోషల్ మీడియా పవన్, జనసేన అభిమనులు ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్ల కౌంటర్ ఎటాక్ చాలా తీవ్రంగానే ఉంది. కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య వార్ గట్టిగానే నడుస్తోంది.
పవన్ అభిమానులు సినిమాల పరంగా వేరే హీరోల ఫ్యాన్స్‌తో ఆన్ లైన్ యుద్ధాలు చేయడం చూశాం. రాజకీయంగా వైసీపీతో వాళ్ల కయ్యం గురించీ తెలిసిందే. కానీ ఇప్పుడు చిత్రంగా డీఎంకే పార్టీ ఫ్యాన్స్‌తో వారు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్నారు. సనాతన ధర్మం గురించి పవన్ చేస్తున్న వ్యాఖ్యల మీద వెటాకారాలాడుతూ డీఎంకే అభిమానులు ఎప్పటెప్పటి వీడియోలన్నింటినీ బయటికి తీసి ట్రోల్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ వాళ్లకు దీటుగా బదులిస్తున్నారు. పవన్ సినిమాల్లో గొప్ప స్థాయిని అందుకుని.. రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని డిప్యూటీ సీఎం అయ్యారని.. కానీ సినిమాల్లో ఫెయిల్యూర్ అనిపించుకున్న ఉదయనిధి, రాజకీయాల్లోనూ పెద్దగా సాధించిందేమీ లేదని.. కేవలం తండ్రి సీఎం కావడంతో ఈజీగా డిప్యూటీ సీఎం అయిపోయాడని ఎద్దేవా చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఉదయనిధిని ఎద్దేవా చేస్తున్నట్లుగా తమిళ టాప్ స్టార్ విజయ్ వ్యాఖ్యానించిన ఓ వీడియోను షేర్ చేసి కౌంటర్లు వేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్‌కు డీఎంకేను వ్యతిరేకించే తమిళ అభిమానులు తోడవుతుండడం విశేషం.