గ్రౌండ్ రియాలిటీ లోకి బాబు పవన్ !
పోలింగ్ ముగిసిన తరువాత కూటమి నేతలు విదేశీ ప్రయాణం పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 30 May 2024 3:40 AM GMTపోలింగ్ ముగిసిన తరువాత కూటమి నేతలు విదేశీ ప్రయాణం పెట్టుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మే 19 నుంచి 28 దాకా అమెరికా టూర్ లో ఉన్నారు అని ప్రచారంలో ఉంది. ఆయన అనేక దేశాలు తిరిగి వచ్చారని వైసీపీ విమర్శలు చేసింది. మొత్తానికి చూస్తే బాబు 29న హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ కూడా విదేశాల్లో సాగింది అని అన్నారు. అయితే దాని మీద ఎటువంటి అప్డేట్స్ లేవు. చంద్రబాబు ఈ నెల 30 నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో ఉంటారు. ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం లోకి కూడా వెళ్తారు. కౌంటింగ్ అయ్యేంతవరకూ బాబు ఉండవల్లిలోని నివాసం నుంచే పరిశీలన చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు కలసి ఈ నెల 31న ఉండవల్లిలోని తన నివాసంలో పోలింగ్ సరళి మీద పూర్తి స్థాయిలో చర్చిస్తారు అని అంటున్నారు. పోలింగ్ జరిగి 18 రోజులు అప్పటికి అవుతుంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి పూర్తి సమాచారం తెప్పించుకున్న ఇరువురు నేతలూ దాని మీదనే లోతైన అధ్యనం చేస్తారు అని అంటున్నారు.
టీడీపీ కూటమి గెలిచి తీరుతుందని ఇప్పటికే పార్టీ నేతలకు చెప్పిన చంద్రబాబు జూన్ 4 ఫలితాల వరకూ ఓపికగా ఉండాలని సూచించారు. ఇక జనసేన టీడీపీ కలసి ఫలితాల విషయంలో పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన తరువాత కౌంటింగ్ గురించి కూడా చర్చిస్తారు అని అంటున్నారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా పాలు పంచుకుంటారు అని అంటున్నారు.
పోలింగ్ రోజున జనసేన టీడీపీ బీజేపీ పూర్తి కో ఆర్డినేషన్ తో పనిచేసి మంచి ఫలితాలు సాధించాయి. అదే విధంగా కౌంటింగ్ రోజున కూడా ఒక కో ఆర్డినేషన్ తో పనిచేయాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఇవ్వకుండా ప్రతీ ఒక్క ఓటూని లెక్కించేలా చూడాలని కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
మొత్తం మీద చాలా కాలానికి పవన్ చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఈ భేటీ తరువాత ఇరువురు నేతలూ ఏపీలో టీడీపీ కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్నది మీడియాకు చెబుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే గెలుస్తామని మాత్రం చెబుతారని సీట్ల విషయంలో మ్యాటర్ రివీల్ చేయకుండా ఒక వ్యూహం ప్రకారమే ముందుకు సాగుతారని అంటున్నారు.