Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఓట్లూ.. నారా లోకేష్‌కే.. నిజం!

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లు మామూలుగా లేవు. అత్యంత హీటెక్కాయి.

By:  Tupaki Desk   |   12 May 2024 2:41 PM GMT
చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఓట్లూ.. నారా లోకేష్‌కే.. నిజం!
X

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లు మామూలుగా లేవు. అత్యంత హీటెక్కాయి. వైసీపీని గ‌ద్దెదించుడే ల‌క్ష్యంగా మూడు పార్టీలూ కూట‌మిగా బ‌రిలో దిగాయి. ఒకవైపు సెంటిమెంటు అస్త్రంతో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల కూడా ప‌రుగులు పెట్టి మ‌రీ ప్ర‌చారాన్ని జోరెక్కించారు. ఇక‌, `న‌మ్మ‌కం` సెంటిమెంటుతో వైసీపీ అడుగులు వేసింది. మొత్తంగా ప్ర‌చారం అయితే.. భారీ ఎత్తున సాగింది. నోటిఫికేష‌న్ విడుద‌లైన 23 రోజుల పాటు నాయ‌కులు రాష్ట్రాన్నిచుట్టేశారు. దీంతో ఈ ఎన్నిక‌ల‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. దీంతో ప్ర‌తి ఓటూ అంతే కీల‌కంగా మారింది.

కీల‌క‌మైన నాయ‌కుల ఓట్లు ఎక్క‌డ ఉన్నాయి? అనేది ఇప్పుడు ఆస‌క్తిగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. ముఖ్యంగా పార్టీల అధినేత‌ల ఓట్లు ఎక్క‌డ ఉన్నాయ‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, కుమారుడు నారా లోకేష్ ఓట్లు.. ఉండ‌వ‌ల్లి ప‌రిధిలో ఉన్నాయి. ఇది .. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌స్తుంది. సో.. వీరి మూడు ఓట్లు కూడా.. నారా లోకేష్‌కే ప‌డ‌నున్నాయి. నిజానికి చంద్ర‌బాబు కుప్పంలో పోటీ చేస్తున్నారు. కానీ, ఆయ‌న అక్క‌డ ఓటు వేయ‌డం లేదు. అక్క‌డికి ట్రాన్స్‌ఫ‌ర్ పెట్టుకోలేదు. దీంతో ఉండ‌వ‌ల్లిలోనే గ‌త ఎన్నిక‌ల్లోనూ ఓటేశారు.

ఇక‌, వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ దంప‌తుల‌కు ఓటు హ‌క్కు పులివెందుల‌లో ఉంది. దీంతో వారిద్ద‌రూ అక్క‌డే ఓటు వేయ‌ను న్నారు. సీఎం జ‌గ‌న్ అక్క‌డి నుంచో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆదివారం ఉద‌యం వెళ్లి ఓటు హ‌క్కు వినియోగించుకో నున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నుంచి బ‌రిలో ఉన్నారు. కానీ, ఆయ‌న ఓటు హ‌క్కు మాత్రం మంగ‌ళ‌గిరి పరిధిలో ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈయ‌న కూడా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోనే ఓటు వేయ‌నున్నారు. ఇది కూడా నారా లోకేష్కే ప‌డే అవ‌కాశం ఉంది. ఇక‌, వైఎస్ ష‌ర్మిల ఓటు హ‌క్కు ఏపీలో లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఆమె గ‌త న‌వంబ‌రు- డిసెంబ‌రులో జ‌రిగిన‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓటేశారు.