కూటమిలో ముచ్చటగా అన్నదమ్ముల అనుబంధం !
పవన్ కి సైతం సరైన స్థానం కల్పిస్తూ ప్రోటోకాల్ విషయంలో తన తరువాత స్థానం ఇస్తూ చంద్రబాబు కూడా ముందుకు సాగుతున్నారు.
By: Tupaki Desk | 29 July 2024 3:49 AM GMTటీడీపీ కూటమిలో పొరపొచ్చాలు వస్తాయని అనుకునే వారికి ఎప్పటికపుడు నిరాశను కలుగచేసే పరిణామాలు ఉంటున్నాయి. చంద్రబాబు పట్ల అపారమైన గౌరవాభిమానాలు పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు. పవన్ కి సైతం సరైన స్థానం కల్పిస్తూ ప్రోటోకాల్ విషయంలో తన తరువాత స్థానం ఇస్తూ చంద్రబాబు కూడా ముందుకు సాగుతున్నారు.
ఇక నారా లోకేష్ సైతం పవన్ ని గౌరవిస్తూ మర్యాదతోనే మెలగుతూంటే పవన్ కూడా చంద్రబాబుతో పాటు లోకేష్ పట్ల కూడా సమానమైన ప్రేమాభిమానాలను చూపిస్తున్నారు. ఇటీవల జనసేన పార్టీ సమావేశాలలో పవన్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లలో కొన్నింటికి గోదావరి జిల్లాల అన్నదాత అద్భుత మహిళ అయిన డొక్కా సీతమ్మ పేరు ఎందుకు పెట్టకూడదని తన మనసులోని మాటను వ్యక్తం చేసారు.
దానికి ఆచరణలో చేసి చూపించారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జగనన్న గోరు ముద్ద పధకానికి పేరు మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం అని పేరు పెట్టారు లోకేష్. అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం వంటి మహనీయుల పేర్లను కూడా పెట్టారు.
దీని మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చంద్రబాబుకు లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. జాతి కోసం పాటు పడిన పెద్దలు ప్రముఖుల పేర్లను పెట్టడం ద్వారా స్పూర్తిని కలిగించారని చంద్రబాబుతో పాటు లోకేష్ ని కొనియాడారు. ఇక దానికి లోకేష్ బదులిస్తూ పవన్ అన్న స్పూర్తితోనే ఇదంతా అని అన్నారు. ఆయన ఆలోచనలను కూడా తాము తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. మొత్తం మీద చూస్తే పవన్ అన్నా అని లోకేష్ సంభోదించడం, పవన్ ఆలోచనలతో ముందుకు సాగుతున్నామని చెప్పడం వంటివి చూస్తే కనుక కూటమిలో కొత్త బంధం బాగుందని అంతా అంటున్నారు.
పవన్ లోకేష్ ఇద్దరూ అన్న దమ్ములు మాదిరిగా ఉంటూ కీలకమైన శాఖలను చూస్తూ ముందుకు సాగుతున్నారని అంటున్నారు. రాజకీయాలకు భేషజాలకు అతీతంగా విశాలమైన దృక్పధంతో కూటమి అగ్ర నేతలు సాగడం మంచి పరిణామమని అంటున్నారు. దీని వల్ల కూటమి మరింతగా పటిష్టమై ప్రజలకు మేలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు.
గతంలోనూ కొన్ని పార్టీలు కలసి కూటమి కట్టినా అధికారంలోకి వచ్చాక తీరు వేరేగా ఉండేదని కానీ ఇక్కడ మాత్రం అనుబంధమే కనిపిస్తోందని మరీ ముఖ్యంగా సీనియర్ నేతగా చంద్రబాబు ఉంటే యువ నేతలుగా ఉన్న పవన్ లోకేష్ ఒక మైండ్ సెట్ తో ముందుకు సాగడం కూటమి భవిష్యత్తుకు శ్రీరామ రక్షగా ఉందని అంటున్నారు. ఇది కూటమిలోని మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇతర నాయకులకూ సైతం స్పూర్తిని ఇస్తుందని అంటున్నారు.