బాబు పవన్ కాంబో మినిమం పదేళ్లు!?
ఇక పవన్ విషయం తీసుకుంటే ఆయన వెండి తెర మీద మూడు దశాబ్దాల పాటు పవర్ స్టార్ గా వెలుగుతున్న వారు.
By: Tupaki Desk | 30 Jun 2024 3:31 AM GMTఏపీలో కొత్త రాజకీయం ఏంటో తాజా ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూపించారు. ఈ ఇద్దరికీ భిన్నమైన రాజకీయ సామాజిక నేపధ్యం ఉంది. చంద్రబాబు రాజకీయంగా ఆరితేరిన వారు. తాజా గెలుపుతో ఆయన నాలుగవ సారి సీఎం అయ్యారు. ఇక పవన్ విషయం తీసుకుంటే ఆయన వెండి తెర మీద మూడు దశాబ్దాల పాటు పవర్ స్టార్ గా వెలుగుతున్న వారు.
రాజకీయంగా పదిహేనేళ్ల అనుభవం ఉంది. వ్యూహాల విషయంలో ఆయన గ్రేటని తాజాగా కూటమి కట్టడంలో నిరూపించారు. ఇక బలమైన సామాజిక వర్గం పవన్ కి కొండంత అండ. అయితే పవన్ ఎలాంటి ఇగోస్ కి వెళ్ళకుండా టీడీపీతో పొత్తుకు వెళ్లారు. 21 సీట్లు మాత్రమే తీసుకున్నారు. తీసుకున్న వాటిని అన్నింటికీ గెలిచారు. ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు పక్క సీటుని షేర్ చేసుకున్నారు.
ఆ విధంగా తన రాజకీయ గమ్యం ఏంటో చాలా చక్కగా స్వపక్షం వారికీ విపక్షం వారికీ స్వజనులకూ తేటతెల్లం చేశారు. ఇక చంద్రబాబు విషయం తీసుకున్నా ఆయన 1995 నాటి బాబు కానేకారని తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు ద్వారా తెలిసివచ్చింది. ఆనాడు సొంత తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో ఉప ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకోని బాబు ఇపుడు పవన్ కి ఈ పదవిని ఇచ్చారు అంటేనే ఆయన రాజకీయంగా మారిన మనిషి అని అర్ధం అవుతోంది.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు పవన్ బాబు ఇద్దరూ పూర్తిగా వాస్తవిక దృక్పధంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఏ విధంగానూ పొరపొచ్చాలు లేకుండా చూసుకుంటున్నారు. చంద్రబాబు సైతం పవన్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. పవన్ సైతం బాబు పెద్దరికానికి మర్యాద ఇస్తున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ఎన్నో పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి కానీ ఈ విధంగా కలసి మెలసిన అనుభవాలు అయితే లేవు అని అంటున్నారు అయితే ఇంకా ఆదిలోనే కదా అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ పవన్ బాబుల ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఇద్దరి కామన్ అజెండా ఒక్కటే. అదే రాష్ట్రం బాగుండాలి.
తాము విడిపోతే ఏపీలో మళ్లీ వైసీపీ వస్తే చేసిన అభివృద్ధి అంతా పక్కకు పోతుందన్న ఎరుక ఇద్దరిలోనూ ఉంది. అందుకే ఇద్దరూ కలసికట్టుగానే ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు. జనసేనానికి తక్కువ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నా పవన్ పట్టించుకోవడం లేదు. అలాగే బాబు సైతం ఇలాంటి పుకార్ల లాంటి వార్తలను పక్కన పెట్టి పవన్ కి ప్రయారిటీ ఇస్తున్నారు.
ఎన్నికల సభలలో పవన్ మాట్లాడుతూ పదేళ్ల పాటు తమ రెండు పార్టీల పొత్తులు కొనసాగుతాయని నొక్కి చెప్పారు. దీనిని బట్టి చూస్తే 2029లోనూ కలసి పోటీ చేస్తారు అని అర్ధం అవుతోంది. వైసీపీ ఓడినా బలంగానే ఉంది. అందుకే మరో ఎన్నికలోనూ ఆ పార్టీని దెబ్బ తీస్తే నామ రూపాలు లేకుండా పోతుందని అపుడే అసలైన రాజకీయం ఏపీలో సాగుతుందని టీడీపీ జనసేన భావిస్తున్నాయట. అందుకే ఈ రెండు పార్టీల మధ్య ఎవరు ఎన్ని పుల్లలు పెట్టినా బాబు పవన్ అసలు పట్టించుకోరనే అంటున్నారు.