పిఠాపురంలో భూమి కొన్ని పవన్.. ఎకరం ఎంతంటే?
మాటలు చెప్పటం వేరు. చేతల్లో చేసి చూపించటం వేరు. అధికారం కోసం చాలా మాటలు చెప్పే నేతల్ని చూస్తున్నాం.
By: Tupaki Desk | 4 July 2024 5:28 AM GMTమాటలు చెప్పటం వేరు. చేతల్లో చేసి చూపించటం వేరు. అధికారం కోసం చాలా మాటలు చెప్పే నేతల్ని చూస్తున్నాం. పవర్ చేతికి వచ్చిన తర్వాత.. అంతకు ముందు తాను చెప్పిన మాటల్ని గుర్తు పెట్టుకొని.. ఒక్కొక్కటి పూర్తి చేసే వారు చాలా చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరుతారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత కానీ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఆయనకు లభించలేదు. పవన్ కున్న స్టార్ డం ముందు.. ఎమ్మెల్యే పదవి చాలా చిన్నది. అయినప్పటికి ఆ పదవిని చేజిక్కించుకోవటానికి ఆయన చాలానే ప్రయత్నించాల్సి వచ్చింది. ఈ క్రమంలో బోలెడన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికి తాను నమ్మిన సిద్దాంతాల్ని.. విలువల్ని వదల్లేదు.
ఎదురుదెబ్బలు తగిలినా ఓర్చుకున్నారే తప్పించి.. ఏదో రకంగా గెలుపును సొంతం చేసుకోవాలన్న తాపత్రయం ఆయనలో కనిపించలేదు. ఆయన కష్టానికి తగ్గట్లే ఫలితం లభించింది. ఒకప్పుడు రాజకీయాలకు పనికి రాడు.. పవన్ కు రాజకీయాలా? అంటూ గేలి చేసిన వారు సైతం.. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్న వైఖరిని చూసి షాక్ తింటున్నారు. ఒకప్పుడు రాజకీయాలు పార్టు టైంగా చేస్తారని.. కమిట్ మెంట్ తక్కువని నోరు పారేసుకున్న వారి నోట మాట రాకుండా చేస్తున్న పవన్ వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన వేళలో.. ఆయనకు సొంత ఇల్లు కూడా లేదని.. ఎమ్మెల్యేగా గెలిస్తే స్థానికులకు అందుబాటులో ఉండరన్న విమర్శల్ని సంధించారు. అయితే.. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత సొంత ఇల్లు కట్టుకుంటానని పవన్ మాట ఇవ్వటం తెలిసిందే. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ.. పవర్ ఫుల్ స్థానంలో ఉన్న ఆయన తాను చెప్పిన పాత మాటల్ని మర్చిపోలేదు.
ఇటీవల ఆయన పిఠాపురంలో మూడు ఎకరాల భూమిని కొనుగోలుచేసిన విషయం తాజాగా బయటకు వచ్చింది. ఆ మాటకు వస్తే.. ఆ విషయాన్ని పవన్ కల్యాణే స్వయంగా ప్రకటించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హైదరాబాద్ లో ఉంటానని.. పిఠాపురాన్ని పట్టించుకోనని వైసీపీ నేతలు అన్నారని.. ఇప్పుడు తాను పిఠాపురం వాస్తవ్యుడ్ని అని చెప్పేయటమే కాదు.. ‘‘ఇల్లు కట్టుకుంటాను. క్యాంప్ ఆఫీసు కూడా ఉంటుంది. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు వీలుగా వారి నుంచి వినతులు స్వీకరించేందుకు ఐదుగురిని నియమించుకున్నా. వైద్యం.. విద్య.. కిడ్నాప్ లు.. దాడులు. ఉపాధి .. ఇతర సమస్యలు ఏమున్నా మీ వినతులు ఇవ్వండి. వాటిని పరిష్కరిస్తా’’ అంటూ బహిరంగ సభలో పవన్ పేర్కొన్నారు.
తాను కొనుగోలు చేసిన మూడున్నర ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం పూర్తైంది. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలోని రెండు బిట్లను రిజిస్ట్రేషన్ చేయించారు. ఒకటి 1.44 ఎకరాలు కాగా రెండోది 2.08 ఎకరాలు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండు గంటల మధ్యలో పూర్తైనట్లు సమాచారం.
తాజాగా కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన ఆసక్తికర చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఎంత ధర చెల్లించి పవన్ కల్యాణ్ భూమి కొన్నారన్న దానికి సంబంధించి స్థానికంగా అందుతున్న సమచారం ప్రకారం అక్కడ రికార్డుల ప్రకారం ఎకరం రూ.15-16 లక్షల వరకు ఉందని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్ లో చాలా ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. తాజాగా కొనుగోలు చేసిన మూడున్నర ఎకరాల్లో రెండు ఎకరాల్లో క్యాంప్ ఆఫీసు.. మిగిలిన భూమిలో ఇంటిని కట్టుకోవాలన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురంవాస్తవ్యుడిగా ఉంటానని పలు బహిరంగ సభల్లో చెప్పిన పవన్.. తాజాగా ఆ మాటను నిజం చేయటం గమనార్హం. అది కూడా.. ఎమ్మెల్యేగా గెలిచిన నెల లోపే భూమిని కొనుగోలు చేయటం.. ఇంటి నిర్మాణానికి సిద్ధం కావటం ద్వారా.. తాను మాటల మనిషిని కాదు.. చేతల మనిషిని అన్న విషయాన్ని పవన్ మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పాలి.