కీలకమైన టైం లో పవన్ అక్కడ...కూటమికి షాక్...!?
పవన్ కళ్యాణ్ ని ఏదో విధంగా అధికారంలోకి చూడాలనుకునే వారు కూటమికి ఓటు వేస్తారు.
By: Tupaki Desk | 30 March 2024 11:30 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ఆయన ప్రచారం కూటమికి అతి పెద్ద ఆక్సిజన్ అన్న సంగతి తెలీందే. ఏపీ లో గేమ్ చేంజర్ గా ఈసారి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ అని అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు జగన్ పాత కాపులు అయిపోయారు. ఇద్దరి పాలన జనాలు చూసారు. అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. పవన్ అధికారంలోకి వస్తే ఏమి చేస్తారు అన్న ఆసక్తి ఉంది.
కానీ పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేయడం లేదు. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ని ఏదో విధంగా అధికారంలోకి చూడాలనుకునే వారు కూటమికి ఓటు వేస్తారు. దానికి పవన్ చేయాల్సిన పని కూటమికి భారీ ఆధిక్యత వచ్చేలా ఏపీ అంతా తిరిగి మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపుగా ప్రచారం చేయాల్సి ఉంది. అయితే పవన్ మాత్రం తమ పార్టీ పొత్తులో సీట్లు తీసుకుని పోటీ చేస్తున్న చోటనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.
అలా మిగిలిన ప్రచారం ఆయన కూటమికి కూడా చేస్తారు అని అంటున్నారు. అయితే ఎంత చేసినా మే 11లోగానే చేయాలి. అయితే పవన్ తొలి విడత మలి విడత షెడ్యూల్ అంతా జనసేన అభ్యర్ధుల ప్రచారానికే పరిమితం అవుతోంది. పవన్ ఈసారి ఎక్కువగా పిఠాపురంలో కూడా ప్రచారం చేయనున్నారు. ఇది చాలదు అన్నట్లుగా పవన్ సేవలను బీజేపీ జాతీయ నాయకత్వం వేరే రాష్ట్రాలలో ఉపయోగించుకోవాలని చూస్తోంది అంటున్నారు.
ముఖ్యంగా కర్నాటకలో పవన్ కళ్యాణ్ ద్వారా ప్రచారం చేయించాలని చూస్తోంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ని కర్నాటకలో తెలుగు వారు ఎక్కువగా ఉన్న చోట్ల ప్రచారం చేయాలని కోరినట్లుగా చెబుతున్నారు. కర్నాటక రాజధాని బెంగళూరు నగరం పరిధిలోని అనేక నియోజకవర్గాలలో తెలుగు వారు పెద్ద ఎత్తున ఉన్నారు. వారిని ఆకట్టుకోవాలంటే పవన్ ప్రచారం తప్పనిసరి అని బీజేపీ భావిస్తోంది.
అదే విధంగా కర్నాటకలోని బొమ్మనహళ్లి, బీటీఎం లేఅవుట్, హెచ్‌ఎ్‌సఆర్ లేఅవుట్, జయనగర్, జేపీనగర్, బసవనగుడితో పాటు బెంగళూరు సెంట్రల్ పరిధిలోని మారతహళ్లి, బెంగళూరు ఉత్తర పరిధిలోని యలహంక ప్రాంతాల్లో పవన్‌కల్యాణ్ తో పెద్ద ఎత్తున రోడ్ షోలను నిర్వహించాలని కూడా బీజేపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఆ విధంగా పవన్ ప్రచారానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ని కూడా ఆ పార్టీ తయారు చేస్తోంది.
దీంతో బీజేపీ టార్గెట్ 400 ప్లస్ ఎంపీ సీట్లు కోసం పవన్ సేవలను సౌత్ స్టేట్స్ లో ఉపయోగించుకోవాలని భావిస్తోంది అంటున్నారు. మరి ఏపీలో చూస్తే అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కి జరుగుతున్నాయి. టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైసీపీల మధ్య హోరాహోరీ పోరు ఉంది. ప్రతీ క్షణం ఏపీలో విలువైనదే. అటు అసెంబ్లీలో గెలవడం కూడా కూటమికి ముఖ్యం.
ఈ సమయంలో పవన్ ప్రచారం ఏపీలో చాలా అవసరం అంటున్నారు. కానీ పవన్ ని పక్క రాష్ట్రాల్లో ప్రచారానికి బీజేపీ పిలవడం అంటే ఏపీని ఆ పార్టీ లైట్ గా తీసుకుంటోందా అన్న చర్చ మొదలైంది. ఏపీలో ఎవరు గెలిచినా పాతిక ఎంపీ సీట్లు తమ ఖాతాలో సులువుగా పడతాయన్న ఆలోచనలతోనే కర్నాటక వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం మీద బీజేపీ గురి పెట్టింది అని అంటున్నారు.
సరే ఈ విధంగా చేయడం బీజేపీకి బాగుంటుంది. అలాగే పవన్ కి కూడా బాగానే ఉంటుంది. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఏపీలో రాజకీయం చేస్తున్న తెలుగుదేశానికి ఏమిటి లాభం అన్న చర్చ వస్తోంది. ఏపీలో టీడీపీకి అధికారంలోకి రావడం చాలా ముఖ్యం అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే పవన్ సరైన టైం లో ఇంకా చెప్పాలంటే కీలకమైన టైం లో ఏపీ రాజకీయ తెర మీద కొద్ది రోజులు కనిపించకుండా పోతే దాని ప్రభావం ఎంత అన్నది ఇపుడు చర్చగా సాగుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. కూటమి పెద్దలు ఎలా దీనిని సర్దుకుంటూ ముందుకు సాగుతారో.