Begin typing your search above and press return to search.

కటౌట్ కాదు... నేరుగా పవనే రంగంలోకి దిగుతున్నారు!

అవును... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి జనసేనాని రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ - జనసేన అభ్యర్థులకు మద్దతుగా తనమార్కు ప్రచారం చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 3:34 AM GMT
కటౌట్  కాదు... నేరుగా పవనే రంగంలోకి దిగుతున్నారు!
X

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్నట్లు ప్రకటించిన జనసేనాని... తెలంగాణలో బీజేపీతో కలిసి రంగంలోకి దిగబోతున్నారు. ఈ సమయంలో ఇక ఎన్నికలకు వారం రోజులే సమయం ఉండటంతో నేరుగా ప్రచారంలోకి దిగుతున్నారు. ఈ మేరకు తాజాగా షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ ఎన్నికల కోసం పవన్ రోజున్నర సమయం కేటాయించారు

అవును... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి జనసేనాని రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ - జనసేన అభ్యర్థులకు మద్దతుగా తనమార్కు ప్రచారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా అధికార బీఆరెస్స్ పై ఎలాంటి కామెంట్లు చేస్తారనే సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా పవన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఫైనల్ అయింది.

ప్రచారంలో భాగంగా... ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్యటించ‌నున్న నియోజ‌క‌వ‌ర్గాల లిస్ట్‌ ను ఆ పార్టీ ఆన్ లైన్ వేదికగా విడుదల చేసింది. ఇందులో భాగంగా నేటి నుంచి తెలంగాణలో ఎన్నిక‌ల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు జనసేనాని. ఈరోజు మధ్యాహ్నం మొదలవ్వబోయే పవన్ ఎన్నికల ప్రచారం రేపు సాయంత్రంతో ముగిసిపోతుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఒక నియోజకవర్గంలో పవన్ ప్రచారం నిర్వహించబోతుండగా.. రేపు మూడు నియోజకవర్గాలకు ఛాన్స్ ఇచ్చారు!

ఇందులో భాగంగా... ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ లో ప్రచారం నిర్వహించనున్న పవన్ కల్యాణ్... రేపు ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధాహ్నం 2 గంటలకు సూర్యపేట, సాయంత్రం 4:30 గంటలకు దుబ్బాక నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. వీటిలో కొత్తగూడెం ఒక్కటే జనసేన సీటు కాగా.. మిగిలిన మూడు చోట్లా బీజేపీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు!

వీరిలో కొత్తగూడెం నుంచి జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్‌ రావుకు మద్దతుగా ప్రచారం చేయనున్న పవన్ కల్యాణ్... సూర్యాపేటలో బీజేపీ అభ్యర్థి సంకినేని వెంక‌టేశ్వర‌రావు, దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు ల గెలుపుకోసం ప్రచారం చేయనున్నారు. ఇదే సమయంలో వరంగల్ వెస్ట్ నుంచి రావు పద్మ, వరంగల్ ఈస్ట్ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు లకు మద్దతుగా ప్రసంగించనున్నారు.

కాగా... తెలంగాణలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 8 స్థానాలు కేటాయించింది బీజేపీ. ఇలా జనసేనకు కేటాయించిన ఎనిమిది స్థానాల్లో కూకట్‌ పల్లి, కోదాడ, తాండూరు, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా, నాగర్‌ కర్నూలు ఉన్నాయి. వీటిలో కొత్తగూడెంలో మాత్రమే జనసేనాని ప్రచారం చేయనున్నారు. మిగిలిన మూడు చోట్లా బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయనున్నారు.