టీడీపీతోనూ పవన్ ఫైట్ చేయొచ్చు...!
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కి ప్రయారిటీ ఇవ్వక తప్పదని ఆయన అన్నారు.
By: Tupaki Desk | 19 May 2024 1:30 AM GMTరేపటి రోజున టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే జనసేన రోల్ ఎలా ఉంటుంది అలాగే ఏపీ రాజకీయాల మీద ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకనాడు పవన్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్న రాజు రవితేజ కీలకమైన విశ్లేషణ చేశారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కి ప్రయారిటీ ఇవ్వక తప్పదని ఆయన అన్నారు.
అదే జరిగితే అపుడు టీడీపీ యువనేత నారా లోకేష్ ఫ్యూచర్ ఇబ్బందుల్లో పడుతుందని కూడా ఆయన అంచనా వేశారు. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో టీడీపీతోనూ రాజకీయ పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయని జోస్యం లాంటి అంచనా చెప్పారు. ఈ రోజున మిత్రులుగా ఇద్దరూ కూటమిలో ఉన్నా పవన్ చంద్రబాబుని విభేదించే చాన్స్ కూడా ఉందని అన్నారు.
తనకు ఎవరైతే చాలా దగ్గరగా ఉంటారో వారితోనే ఎక్కువగా పోరాటం చేస్తారు అని ఆయన మరో మాటగా చెప్పారు. జనసేన నుంచి నేతలు బయటకు ఎక్కువగా వెళ్ళడానికి కారణం వారి అనుకున్నది అక్కడ జరగకపోవడమే అని ఆయన అన్నారు. తగిన అవకాశాలు కల్పిస్తూ నాయకులను తయారు చేసే చోటనే ఎవరైనా ఉంటారని ఆయన అన్నారు.
ఇక టీడీపీ కూటమి కనుక విపక్షంలో ఉంటూ జగన్ నాయకత్వంలో వైసీపీ అధికారంలోకి వస్తే ఏమి జరుగుతుంది అంటే దాని మీద కూడా ఆయన సునిశిత విశ్లేషణ చేశారు. ఏపీలో అధికార పార్టీ మీద మరోసారి విపక్షాలు అంతా కలసి భీకరమైన పోరాటం చేస్తాయని అది తారస్థాయిలో సాగుతుందని అన్నారు.
ఏపీలో మతపరమైన కలహాలు వంటి పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యం లేదు అని ఆయన అంటున్నారు. అదే విధంగా చూస్తే ఏపీలో రాజకీయం ఢీ అంటే ఢీ అన్నట్లుగా మారిపోవడం వెనక అధికార దాహం ఎక్కువ కావడమే అసలు కారణం అన్నారు.
పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటంగా ఏపీ రాజకీయం సాగుతోందా అన్న అన్న దానిని ఆయన బదులిస్తూ ప్రభుత్వం పేదల పక్షంగానే ఉండాలని వారి విద్య వైద్యం వంటి వాటి విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు. పెద్దలకు మేలు చేసే కార్పోరేట్ విధానాల వల్ల ధనికులు మరింత ధనికులు అవుతారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఏ ప్రభుత్వం అయినా ధనవంతుల క్లబ్ గా మారరాదని ఆయన అభిప్రాయపడ్డారు.
పచ్చని పోలాలను భూములను కార్పోరేట్ శక్తులకు దారాదత్తం చేసి ఆ భూములలో కాంక్రిట్ జంగిల్స్ నిర్మించడం వల్ల పేదలకే తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. సొంత భూములు కోల్పోయి వారు అక్కడే చిరుద్యోగులుగా కూలీలుగా మారిఒపతారని ఆయన అన్నారు. అదే విధంగా చూస్తే కనుక బడా పరిశ్రమల స్థాపన వల్ల రాష్ట్రానికీ పేదలకు దక్కే ప్రయోజనం అతి తక్కువగానే ఉంటుందని ఆయన అన్నారు.
ప్రభుత్వాలు పేదలను పైకి తీసుకుని వచ్చే కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని అన్నారు. మధ్యతరగతి వర్గం ఎక్కువగా ఉంటేనే సమాజానికి మేలు జరుగుతుందని తనదైన విశ్లేషణ వింపించారు. పేదరికం ఎంత తగ్గితే అంతలా సమాజానికి మేలు అని అన్నారు.