Begin typing your search above and press return to search.

అటు పవన్ పరువు... ఇటు బాబు వ్యూహాలు...!

తెలంగాణా ఎన్నికలు కాదు కానీ చిత్రమైన రాజకీయాలను అంతా చూస్తున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తులో జనసేన ఉంది.

By:  Tupaki Desk   |   19 Nov 2023 3:56 AM GMT
అటు పవన్ పరువు... ఇటు బాబు వ్యూహాలు...!
X

తెలంగాణా ఎన్నికలు కాదు కానీ చిత్రమైన రాజకీయాలను అంతా చూస్తున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తులో జనసేన ఉంది. ఒక వైపు కో ఆర్డినేషన్ మీటింగ్స్ జోరుగా సాగుతున్నాయి. క్షేత్ర స్థాయిలో రెండు పార్టీలు కలసి పనిచేయాలని కూడా తీర్మానిస్తున్నాయి. అదే టైం లో తెలంగాణాలో మాత్రం జనసేనకు తెలుగుదేశం పక్కాగా హ్యాండ్ ఇస్తోంది.

తెలుగుదేశం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. పార్టీ పెట్టాక టీడీపీ ఇలా పోటీ నుంచి తప్పుకోవడం ఇదే మొదటిసారి. పోనీ తెలుగుదేశం పోటీ చేయడంలేదు, మిత్రపక్షంగా జనసేన ఉంది. ఆ పార్టీ పోటీలో ఉంది. దానికి మద్దతు ఇవ్వవచ్చు కదా.

ఇదే అందరిలోనూ మెదులుతున్న ఆలోచనగా ఉంది. పోటీకి దూరం అంటూ టీడీపీ చెప్పి ఊరుకుంది. కానీ అండర్ కరెంట్ గా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తోంది. తమ్ముళ్ళు చాలా చోట్ల బాహాటంగానే కాంగ్రెస్ జెండాను పట్టుకుని మరీ హడావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ కి మద్దతు అంటూ కూడా తమ్ముళ్ళు కొన్ని చోట్ల ప్రకటించేస్తున్నారు.

ఇక చంద్రబాబు అయితే మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. ఆయన రాజకీయంగా ఎక్కడా బయటకు కనిపించడంలేదు కానీ బాబు మార్క్ వ్యూహాలు అయితే అమలు అవుతున్నాయని అంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ రావాలంటే ఏమి చేయాలో అన్నీ కూడా టీడీపీ అధినాయకత్వం చేస్తోంది అని అంటున్నారు.

ఇలా తెలంగాణా రాజకీయం ఉంటే పవన్ కళ్యాణ్ తన వ్యూహాల మేరకు పోటీకి దిగారు. మొదట 32 సీట్లలో ఒంటరి పోరుకు దిగుతామని చెప్పినా ఆ తరువాత మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎనిమిది సీట్లకు బరిలోకి దిగుతున్నారు. అందులో టీడీపీకి మస్తుగా ఓట్లున్న కూకట్ పల్లి లాంటి సీట్లు ఉన్నాయి. ఖమ్మంలోనూ జనసేన పోటీలో ఉంది.

బీజేపీకి టీడీపీకి అధికారికంగా పొత్తు లేదు. కాబట్టి బీజేపీ ఊసు మరచిపోయినా జనసేనతో పొత్తు ఉంది కదా మరి జనసేనకు తెలుగుదేశం మద్దతు ఇవ్వవచ్చు కదా అన్నది తెలంగాణా జనసైనికుల మాట. అంతే కాదు పవన్ కళ్యాణ్ కి ఇది సవాల్ లాంటి ఎన్నిక అని అంటున్నారు

తెలంగాణాలో గెలిచి తీరాలని లేదు కానీ గౌరవప్రదంగా ఓటమి ఉన్నా మేలు అన్నది జనసేనలో ఉన్న అంతర్మధనం. మరి అలాగ జరుగుతుందా అన్నదే చూడాలని అంటున్నారు. ఎందుచేతనంటే కాంగ్రెస్ బీయారెస్ హోరాహోరీగా పోరు సాగిస్తున్న వేళ జనసేన రంగంలో ఉంది. ఆ పార్టీకి కొంత బలం ఉన్నా అదంతా పవన్ అభిమాన జనం బలం అయినా టీడీపీ నుంచి కూడా కావాల్సినంత మద్దతు దక్కితే జనసేన ఎంతో కొంత ఒడ్డున పడే చాన్స్ ఉంటుంది కదా అన్నది ఒక అభిప్రాయంగా ఉంది.

కానీ టీడీపీ చూపు మాత్రం కాంగ్రెస్ మీదనే ఉంది అని అంటున్నారు. ప్రచారం అలాగే సాగుతోంది. మరి టీడీపీ ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకుని తెలంగాణాతో కాంగ్రెస్ తో చేతులు కలిపితే రేపటి రోజున ఏపీలో కూడా ఆ ప్రభావం ఉండదా అన్నదే కీలకమైన ప్రశ్న.

పవన్ కళ్యాణ్ కి అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడమే ఇష్టం. మరి కాంగ్రెస్ కూటమి కట్టిన ఇండియా వైపు కనుక బాబు మొగ్గు చూపితే అపుడు ఏపీలో పొత్తుల పరిస్థితి ఏంటి అన్నది కూడా డౌట్ గా ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఏపీలో రాజకీయాన్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేస్తాయని అంతా అంటున్నారు. జనసేనకు కూడా కొత్త అనుభవాలను అనేకం అందిస్తాయని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.