పవనే సీఎం.. అక్కడ వైరల్...!?
ఈ మేరకు పవన్ సీఎం అని పోస్టర్లను తయారు చేసి సోషల్ మీడియాలో జనసైనికులు పోస్ట్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 26 Dec 2023 2:30 PM GMTఅవును పవన్ సీఎం కావాలి. ఆయనే మా ముఖ్యమంత్రి అంటోంది జనసైన్యం. తమ అభిప్రాయాలను బాహాటంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. జనసేనకు వచ్చే ఎన్నికల్లో అరవై దాకా సీట్లు అధికారంలో వాటా ఇవ్వాల్సిందే అంటోంది. ఈ మేరకు పవన్ సీఎం అని పోస్టర్లను తయారు చేసి సోషల్ మీడియాలో జనసైనికులు పోస్ట్ చేస్తున్నారు.
పవన్ ఫోటో పెద్దది ఉంచుతూ మరో వైపు జనసేన పార్టీని బ్యాక్ గ్రౌండ్ లో పెడుతూ వారు హల్ చల్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే పవన్ కి సీఎం గా నో చాన్స్ అని నారా లోకేష్ అన్నప్పటి నుంచి జనసైనికులు రగులుతున్నారు. వారు తమ అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు అనుకోవాలి. అయితే దీని మీద జనసేన వ్యూహాత్మకమైన మౌనాన్ని పాటిస్తోంది.
పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడడంలేదు. ఆయన మౌనం వెనక వ్యూహం ఏమిటి అన్నది తెలియకపోయినా పవన్ కూడా నారా లోకేష్ మాటల పట్ల సీరియస్ గానే ఉన్నారు అని అంటున్నారు. ఇక్కడ రెండు కారణాలు జనసేనానికి మండిస్తున్నాయని అంటున్నారు. ఒకటి తాను ఎంతో వత్తిడికి గురి అవుతూ కూడా పొత్తుల విషయంలో ఎక్కడా పలుచన చేసే విధంగా వ్యవహరించలేదు అన్నది పవన్ మనోగతంగా ఉంది అంటున్నారు.
అలాగే రెండు పార్టీలు సమానంగా అవకాశాలు తీసుకుంటూ ముందుకు సాగాలన్నది పవన్ ఆలోచన. ఆయన దాన్ని ఎక్కడా దాచుకోలేదు. టీడీపీ వెనక నడవడంలేదు, కలసి పక్కపక్కన నడుస్తున్నామని చెప్పడంలోని అర్ధం అంతరార్ధం కూడా అదే అని అంటున్నారు. అంటే టీడీపీకి ఎంతో మోరల్ గా సపోర్ట్ జనసేన నుంచే వస్తోంది అన్నది జనసేన భావనగా ఉంది.
అలాంటిది పొత్తు విషయంలో ఇబ్బందిపడే విధంగా కామెంట్స్ టీడీపీలోని అగ్ర నాయకత్వమే చేస్తే ఎలా అన్నదే ఆ పార్టీ మధనంగా ఉంది. ఇక జనసైనికులు చూస్తే వారు పవన్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారు. పవన్ ని ఏ మాత్రం తక్కువ చేసినా ఆయన సంగతి పక్కన పెడితే వారు మాత్రం వైల్డ్ గా రియాక్ట్ అవుతారు. అపుడు పొత్తు పార్టీలకే ఇబ్బంది అన్నది అంటున్నారు.
ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలు అని వాటిని అధిగమించి ఏపీలో వైసీపీని ఓడించే విధంగా రెండు పార్టీలు ముందుకు పోవాల్సిన పరిస్థితులలో అలా కాకుండా అనవసరపు కామెంట్స్ వల్ల వచ్చి లాభమేంటి అన్నది కూడా జనసేన పెద్దలలో చర్చగా ఉంది అంటున్నారు. అంతే కాదు నారా లోకేష్ ఇంటర్వ్యూ తరువాత కూడా టీడీపీలో బాబు స్థాయిలో కూడా ఏ మాత్రం కరెక్షన్ లేదు అంటే కచ్చితంగా టీడీపీ పెద్దల మనోగతంగానే దాన్ని చూడాలా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయట.
ఈ పరిణామాల క్రమంలో ఒక వైపు బలమైన సామాజిక వర్గం ఆకాంక్షలు మరో వైపు హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న వత్తిళ్ళు, సోషల్ మీడియాను ఊపేస్తున్న జనసైనికుల రియాక్షన్స్ ఇవన్నీ కూడా జనసేనలో చర్చకు దారి తీస్తున్నాయని అంటున్నారు. మరి రానున్న రోజులలో ఇవి ఏ వైపునకు టర్న్ అవుతాయన్నది చూడాలని అంటున్నారు.