మాటకు మైత్రికి విలువ ఇస్తా....పవన్ అన్నది ఎవరిని ఉద్దేశించి....!?
యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలోని పోలిపల్లిలో జరిగిన భారీ సభను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
By: Tupaki Desk | 21 Dec 2023 9:16 AM GMTయువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలోని పోలిపల్లిలో జరిగిన భారీ సభను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. పవన్ స్పీచ్ అంతా వాడిగా వేడిగా సాగింది. ఆయన వైసీపీ అధినేత జగన్ ని అలాగే ఆయన ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శించారు. ఏపీ నుంచి వైసీపీ ప్రభుత్వం పోవాలని గట్టిగా కోరుకున్నారు.
ఇదిలా ఉంటే ఆయన తన ప్రసంగం ముగించే ముందు అని చెబుతూ ఇవి ముగింపు వాక్యాలు అని కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అది తన గురించి తన వ్యక్తిత్వం గురించి ఆయన చెప్పుకున్నారు. నేను మాటకు మైత్రికి ఎక్కువ విలువ ఇస్తాను అని పవన్ అన్నారు. అంతే కాదు కష్టం ఎవరికైనా వస్తే తాను సాయంగా ఉంటాను అని అన్నారు. కష్టం అందించే ఒంటరి తనం బాధ ఏంటో తనకు స్వయంగా తెలుసు అని పవన్ అన్నారు.
టీడీపీ అధినాయకుడు చంద్రబాబుకు కొండంత కష్టం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అంటే బాబు జైలులో ఉన్న సందర్భాన్ని అన్న మాట. ఆనాడు తాను ఆ కష్టాన్ని చూసి చలించి మద్దతు ఇచ్చానని సాయం అందించానని పవన్ గట్టిగా చెప్పుకున్నారు.
టీడీపీతో పొత్తు ఎందుకు అన్న దాని కంటే తన మనసు తన వ్యక్తిత్వం ఏ విధంగా ఇలా చేయించిందో పవన్ చెప్పారు. తాను మాటకు విలువ ఇస్తాను అని ఆయన చెప్పడం వెనక అవతల వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్న అర్ధాలు ఉన్నాయా అన్న చర్చ వస్తోంది. అలాగే తాను స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తాను అని పవన్ చెప్పారు. తన మైత్రిని కూడా అలాగే చూడాలని ఆయన అన్యాపదేశంగా సూచించారా అన్న ప్రశ్నలూ ఉదయిస్తున్నాయి.
ఇదంతా ఎందుకంటే మొదట పవన్ యువగళం సభకు రాలేనని టీడీపీ పెద్దలకు సందేశం పంపించారు అని ప్రచారం సాగింది. ఆ తరువాత ఆయన ఇంటికి చంద్రబాబు వెళ్లిన తరువాత పవన్ మనసు మార్చుకుని వచ్చారు అని అంటున్నారు. మరి ఈ మధ్యలో ఏమి జరిగింది, గ్యాప్స్ ఏమైనా వచ్చాయా అన్న చర్చ కూడా నడచింది.
ఇవన్నీ పక్కన పెడితే జనసేన యాభై దాకా సీట్లు పొత్తులో భాగంగా కోరుతోంది అన్నది ప్రచారంలో ఉన్న మాట. మరి దాని కంటే సగం టీడీపీ ఇస్తామని అంటోందని కూడా లీక్స్ వెలువడుతున్నాయి. మరి ఆ లీక్స్ నిజమైతే జనసేన పొత్తు పెట్టుకుని కూడా ఏమీ సాధించలేదు అన్నది ఆ పార్టీ వారికే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా అర్ధం అవుతోంది అని అంటున్నారు.
అంతే కాదు పొత్తు సవ్య దిశగా సాగాలీ అంటే గౌరవప్రదమైన సీట్లు దక్కాలని జనసేన ముందు నుంచి కోరుకుంటోంది అని అంటున్నారు. పవన్ కూడా ఒక వేళ పొత్తు పెట్టుకున్న గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చూస్తే మాత్రం జనసేన అధినేత మాట మైత్రి అన్న మాటలను గట్టిగా పలుకుతూ ఈ కామెంట్స్ చేశారా అన్న చర్చ నడుసోంది.
పవన్ మనస్ఫూర్తిగానే టీడీపీకి స్నేహ హస్తం చాచారని అందరికీ తెలుసు. మరి టీడీపీ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో అన్నది కూడా చర్చకు వస్తోంది. రాజకీయాల్లో ఎపుడూ వ్యూహాలే గెలుస్తాయని చెప్పుకోవాలి. ఇంతకీ పవన్ మాట మైత్రి అన్న వ్యాఖ్యల వెనుక అర్ధం ఏమిటి ఎవరి కోసం అన్నదే హాట్ డిస్కషన్ పాయింట్ గా ఉంది మరి.