Begin typing your search above and press return to search.

మీ బండ్ల మీద ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ రాయొద్దు!

నంబరు ప్లేట్ల మీద నంబరును ఉంచాలని.. దాని స్థానంలో ఈ తరహా పని మాత్రం చేయొద్దని రిక్వెస్టు చేశారు.

By:  Tupaki Desk   |   4 July 2024 5:28 AM GMT
మీ బండ్ల మీద ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ రాయొద్దు!
X

ఏపీలో ఇప్పుడో ట్రెండ్ నడుస్తోంది. ఆ మాటకు వస్తే తెలంగాణలోనూ అందునా హైదరాబాద్ మహానగరంలో ఈ తరహా వ్యవహారాలు అక్కడక్కడా కనిపిస్తోంది. ఇంతకూ ఏపీలో ఇప్పుడు ట్రెండ్ గా మారిన వైనం ఏమంటే.. చాలా మంది యూత్.. పవన్ అభిమానులు తమ వాహనాల నెంబరు ప్లేట్ల మీద ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకూ’’ అంటూ రాయించుకొని తిరుగుతున్నారు. మరికొందరు మాత్రం.. నెంబరు ప్లేట్ ను మీద నెంబరు రాయించుకొని.. మిగిలిన చోట్ల ప్రముఖంగా రాయిస్తున్నారు. కారు వెనుక అద్దాల మీద రాయించటం ఎక్కువగా నడుస్తోంది.

ఈ ట్రెండ్ పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బైకుల మీద నంబరు ప్లేట్ల మీద నంబర్లు కాకుండా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకూ అని రాయించటం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. పిఠాపురంలో తాజాగా నిర్వహించిన వారాహి సభలో మాట్లాడుతూ.. ‘‘ఎవరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకూ అని నంబరు ప్లేట్ల మీద రాయించుకోవద్దు. వాహనానికి ఒరిజినల్ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారు. అప్పుడు నా మీదకు వస్తుంది (సరదాగా). ఇలాంటి ప్లేట్లు ఉన్న వాహనాలతో వన్ వేలో వెళ్లి పోలీసులకు దొరికితే.. అప్పుడు పోలీసులు నన్ను పట్టుకుంటారు (నవ్వుతూ). ఇలా ప్లేట్లు పెట్టుకొని చెడ్డపేరు తీసుకురావొద్దు’’ అంటూ వ్యాఖ్యానించారు.

నంబరు ప్లేట్ల మీద నంబరును ఉంచాలని.. దాని స్థానంలో ఈ తరహా పని మాత్రం చేయొద్దని రిక్వెస్టు చేశారు. అదే సందర్భంలో పిఠాపురం యూత్ కు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. యూత్ లో ఎవరైనా బైక్ రేసింగ్ చేయాలనుకుంటే వారు.. తాను కొనుగోలు చేసిన రెండు ఎకరాల స్థలంలో చేయొచ్చన్నారు. కావాలంటే ఆ స్థలాన్ని రేసింగ్ లకు అనుకూలంగా మారుస్తానని.. అందరికి హెల్మెట్లు.. సేఫ్ గార్డులు.. ఇతర సెక్యూరిటీ పరికరాలు ఏర్పాటు చేయిస్తానని.. అక్కడకు వచ్చి చేసుకోవచ్చు కానీ.. రోడ్ల మీద మాత్రం చేయొద్దంటూ రిక్వెస్టు చేశారు. ఈ మాటల్ని కాస్తంత సరదగా చెప్పినప్పటికీ.. సభకు వచ్చిన యూత్ మాత్రం.. పవన్ మాటలకు చుట్టుపక్కల ప్రాంతాలు దద్దరిల్లేలా రియాక్టు కావటం గమనార్హం.