Begin typing your search above and press return to search.

శ్వేత పత్రాల రిలీజ్...పవన్ తో సరి !

ఇక చంద్రబాబు కాకుండా ఆయన కేబినెట్ లో ఒకే ఒక్కరుగా పవన్ కల్యాణ్ కి కూడా శ్వేతపత్రాలు విడుదల చేసే చాన్స్ వచ్చింది.

By:  Tupaki Desk   |   27 July 2024 3:46 AM GMT
శ్వేత పత్రాల రిలీజ్...పవన్ తో సరి !
X

ఏపీలో వివిధ రంగాల మీద గత అయిదేళ్లలో చోటు చేసుకున్న వైఫల్యాలను గురించి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఆయన ప్రతీ మంత్రిత్వ శాఖ నుంచి సేకరించిన సమాచారం తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వివరిస్తూ శ్వేత పత్రాలను విడుదల చేశారు.

అలా పోలవరం, అమరావతి సహజ వనరులు, లిక్కర్ స్కాం, లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ వంటి కీలక రంగాలలో చోటు చేసుకున్న వైఫల్యాలను మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకుని వచ్చారు. అదే సమయంలో అసెంబ్లీలో కూడా మూడు శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు.

ఇక చంద్రబాబు కాకుండా ఆయన కేబినెట్ లో ఒకే ఒక్కరుగా పవన్ కల్యాణ్ కి కూడా శ్వేతపత్రాలు విడుదల చేసే చాన్స్ వచ్చింది. ఆయన తన విభాగం పంచాయతీ రాజ్ శాఖలో చోటు చేసుకున్న అరచాకాలు నిధుల మళ్ళింపు గత అయిదేళ్ళలో స్థానిక సంస్థలకు కలిగిన ముప్పు, ఉనికి కోల్పోయిన వ్యవహారం వంటి వాటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పారు.

అసెంబ్లీలోనే ఈ మేరకు పవన్ ప్రకటన చేశారు. తొందరలోనే శ్వేతపత్రం రిలీజ్ ఉంటుందని ఆయన చెప్పారు. గత నెలన్నరగా పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలో సమీక్షలు జరుపుతున్నారు అందులో దొరికిన కంటెంట్ తో పూర్తి సమాచారం సమగ్రంగా తీసుకుని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయన కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

మరి పవన్ ఒక్కరికే ఈ చాన్స్ ఉంటుందా లేక నారా లోకేష్ కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. ఆయన ఐటీ మానవవనరుల శాఖ చూస్తున్నారు. అవి కీలక మంత్రిత్వ శాఖలే కావడంతో పాటు ఆయన కూడా ప్రతీ రోజూ సమీక్షలు చేస్తున్నారు. దాంతో లోకేష్ కూడా తన శాఖ మీద సమీక్ష చేసి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. దాంతో శ్వేత పత్రాల విడుదలకు ముగింపు పలికినట్లు అవుతుందని అంటున్నారు.

అయితే శ్వేతపత్రాలు రిలీజ్ ద్వారా ఎమిటి లాభం అన్న చర్చ కూడా ఉంది. ప్రజలు విపక్షానికి సైతం చాన్స్ లేకుండా చేసి వైసీపీని ఓడించిన నేపధ్యంలో ఇంకా శ్వేతపత్రాలే రిలీజ్ చేసుకుంటూ కూర్చుంటారా పాలన మీద దృష్టి పెడతారా అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. మరో వైపు చూస్తే వివిధ శాఖ మీద శ్వేతపత్రాలు రిలీజ్ అన్న కొత్త కాన్సెప్ట్ ని తెచ్చిన వారు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి.

ఆయన మంత్రి కాకుండానే సీఎం అయ్యారు. ఆయనకు తెలంగాణాలో పాలన కొత్త కాబట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు అంటే అర్ధం చేసుకోవచ్చునని తలపండిన అనుభవం ఉన్న బాబు రిలీజ్ చేయడం ద్వారా ఏమిటి లాభమని అంటున్నారు. బాబు అంతకు ముందు సీఎం గా ఉన్నారు. మళ్లీ వచ్చారు. ఆ మధ్యలోనూ ఆయన విపక్ష నేతగా అసెంబ్లీలో ఉన్నారు. సో ఆయనకు అన్నీ తెలుసు అని అంటున్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా శ్వేతపత్రాల రాజకీయం తెలంగాణాలో హిట్ అయింది. ఏపీలో ఏమైంది అన్నది త్వరలోనే తెలుస్తుంది అంటున్నారు.