పవన్ షాకింగ్ కామెంట్స్ : డబ్బులు తీయాల్సిందే..ఓట్లు కొనాలా లేదా మీ ఇష్టం...!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా భీమవరంలో షాకింగ్ కామెంట్స్ చేశారు
By: Tupaki Desk | 22 Feb 2024 12:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా భీమవరంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. డబ్బులు తీయాల్సిందే ఖర్చు పెట్టాల్సిందే అని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని తాను ఎపుడూ చెప్పలేదని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ఖర్చుకు ఒక్కో అభ్యర్ధి పెట్టడానికి 45 లక్షల దాకా పెంచింది అని ఆయన గుర్తు చేశారు.
డబ్బులు ఖర్చు చేయమంటే రాజకీయం నడవదని ఆయన అన్నారు. అందువల్ల డబ్బులు తీసి కనీసం తమ వెంట వచ్చిన వారికి భోజనాలు కూడా పెట్టకపోతే ఎలా చేస్తారు రాజకీయాలు అని ఆయన ప్రశ్నించారు. నా మీద అభిమానంతో క్యాడర్ నాయకుల వెంట వస్తారని కానీ వారి కోసం డబ్బులు తీయాలి కదా భోజనాలు అయినా పెట్టాలి కదా అని పవన్ అంటున్నారు. ఆయన అంతటితో ఆగలేదు. ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం అని మరో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
ఓట్లు కొనలేని రాజకీయం దేశానికి వస్తే మంచిదే కానీ ప్రస్తుతం దేశంలో చూస్తే ఎన్నికల రాజకీయం అలా లేదు కదా అని ఆయన అసలు విషయమే చెప్పారు. ఈ దేశమంతా ఒక అందమైన అబద్దం ఆడుతూ అందులో బతికేస్తోంది అని పవన్ అంటున్నారు. వేల కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేస్తూ ఎవరూ బయటకు ఏమీ చెప్పకుండా గప్ చిప్ అన్నట్లుగా ఫుల్ సైలెంట్ అయిపోతున్నారు అని ఆయన సెటైర్లు వేశారు.
డబ్బులు లేకుండా రాజకీయం చేయమని తాను ఎపుడూ చెప్పను అని పవన్ అన్న మాటలు మాత్రం చర్చనీయాంశం అయ్యాయి. పవన్ ఈ తీరుగా ఎందుకు మాట్లాడారు అన్నదే ఇపుడు అందరిలో ప్రశ్నలుగా వస్తున్నాయి. రాజకీయాలు అంటేనే ఇపుడు ధన ప్రభావంగా మారిపోయాయి. ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన వారు కనీసంగా పాతిక ముప్పయి కోట్లు అయినా ఖర్చు చేయాల్సి వస్తోంది.
అలాగే ఎంపీ అభ్యర్ధి అయితే కనీసంగా వంద కోట్లు ఖర్చు అని లెక్కలు వేస్తున్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడా బాహాటంగా ఎవరూ చూపించరు. ఎన్నికల సంఘం లెక్కలకు సరిపోయేలా కిట్టించి మాత్రమే చూపిస్తున్నారు. పవన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేశారు అని అంటున్నారు. ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడం అన్నది కూడా ఒక ప్రచారంగా ఉంటూ వస్తొంది.
ఇది ఇచ్చేవాడు తీసుకునేవాడు అన్నట్లుగా ఒక బహిరంగ రహస్యంగా మారిపోతోంది. ఈ నేపధ్యంలో పవన్ అన్న మాటలు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయని అంటున్నారు. పోటీకి దిగినపుడు ఇద్దరు కలసి ఒక ఆట ఆడుతున్నపుడు ప్రత్యర్ధిని ఓడించడానికి ఆ పద్ధతిలోనే వెళ్లాలన్నది చాణక్య నీతి. ఇపుడు పవన్ అదే చెప్పారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే జనసేనలో కూడా డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ఇవ్వడం లేదు అని అంటున్నారు. అయితే ఇలాంటి వాటికి కూడా పవన్ తన భీమవరం ప్రసంగంలో ఈ వ్యాఖ్యలతో జవబు చెప్పేశారు అని అంటున్నారు.
డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలని మాట ద్వారా పవన్ తన కొత్త రకం రాజకీయం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు అని తెలుసుకున్నారని అంటున్నారు. ఏపీలో ఎన్నికలు ఈసారి హోరాహోరీగా ఉండబోతున్నాయి. అధికార వైసీపీ విపక్ష టీడీపీ ప్రతిష్టగా తీసుకున్నాయి. అందువల్ల జనసేన కూడా అదే స్థాయిలో దిగాలన్న ఉద్దేశ్యంతోనే పవన్ ఈ రకంగా చెప్పారని అంటున్నారు. ఏది ఏమైన పవన్ బోల్డ్ గా మాట్లాడినా ఇవి వాస్తవాలే అని అంటున్న వారు ఉన్నారు.