ఏపీలో అదే జరిగితే పవన్ కి గోల్డెన్ చాన్స్ ...!?
ఏపీ రాజకీయాలు చూస్తే పోటా పోటీగా సాగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా టైట్ ఫైట్ నడుస్తోంది.
By: Tupaki Desk | 1 April 2024 3:57 AM GMTఏపీ రాజకీయాలు చూస్తే పోటా పోటీగా సాగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా టైట్ ఫైట్ నడుస్తోంది. నువ్వా నేనా అంటున్నాయి వైసీపీ టీడీపీ. ఈ రెండు పార్టీలకు మధ్య సీట్లూ ఓట్ల మధ్య తేడా కూడా పెద్దగా ఉండకపోవచ్చునని అనేక సర్వేలు తెలియచేస్తున్నాయి.
ఇదిలా ఉంటే వైసీపీ మొత్తానికి మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తోంది. టీడీపీ కూటమి కట్టింది. అందులో 31 సీట్లను జనసేన బీజేపీకి ఇచ్చింది. దాంతో టీడీపీ పోటీ చేసే సీట్లు 144కే పరిమితం అయ్యాయి. ఇపుడున్న పరిస్థితుల్లో భీకరమైన పోరులో టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు అన్నవి సోలోగా వచ్చే అవకాశాలు తక్కువ అని అంటున్నారు.
దానికి కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు. 2014లో చూస్తే జనసేన కేవలం సపోర్ట్ చేసి ఊరుకుంది. సీట్లు తీసుకోలేదు. బీజేపీకి 12 సీట్లు మాత్రమే ఇచ్చి మొత్తం 163 సీట్లకు టీడీపీ పోటీ చేస్తే ఆ పార్టీ దక్కించుకున్నది 102 సీట్లు మాత్రమే. ఆనాడు మోడీ వేవ్, అలాగే చంద్రబాబు అనుభవం అన్న ఇమేజ్, పవన్ గ్లామర్ అన్నీ కలిస్తేనే టీడీపీకి ఆ నంబర్ దక్కింది.
ఈసారి అలా కాదు, మోడీ ఏపీకి ఏమీ చేయలేదు. ఇక టీడీపీ జనసేన బీజేపీ ఒక సారి విడిపోయి మళ్లీ కూటమిగా మారి పోటీ చేస్తున్నాయి. దీంతో జనాలకు చాలా డౌట్లు ఉన్నాయి. దాంతో పాటు కూటమికి 2014 నాటి వేవ్ అయితే భయంకరంగా ఏమీ లేదు. వైసీపీ వద్దు అనుకుంటే బొటా బొటీ మార్కులతో టీడీపీ కూటమికి అందలం ఎక్కిస్తారు.
అలా కనుక అధికరం దక్కితే వందకు లోపు సీట్లు కూటమికి రావచ్చు. అందులో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది కూడా చూడాలని అంటున్నారు. టీడీపీకి 80కి పైగా సీట్లు వచ్చినా కూడా అధికారానికి అరడజన్ సీట్లు తక్కువే పడతాయి. అపుడు కచ్చితంగా జనసేన బీజేపీల అవసరం పడుతుంది అని అంటున్నారు.
ఆ విధంగా అయితే జనసేన గెలుచుకునే సీట్లతో కింగ్ మేకర్ అవతారం ఎత్తే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఎందుకంటే మెజారిటీకి ఒక్క సీటు తగ్గినా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం రాదు. అపుడు ఆ ఒక్కరే మొత్తం టన్నుల కొద్దీ బరువుతో ఎదురుగా నిలుచుంటాడు.
ఇలాంటి చాన్స్ అయితే ఈ రోజుకీ జనసేనకు ఉంది. అయితే జనసేన దానికి చేయాల్సిన పని ఏంటి అంటే తమకు దక్కిన 21 సీట్లలో కనీసం పది మందికి పైగా గెలిపించుకోవాలి. వారు కూడా జనసేన గీత దాటకుండా ఉండాలి. అలా జరిగితే కనుక పవర్ షేర్ లో పవన్ కి కచ్చితంగా సీఎం చాన్స్ ఉంది అని అంటున్నారు
ఇవన్నీ ఎలా అంటే ఏపీలో వస్తున్న సర్వేలు చూస్తే అలాంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు. చాలా సర్వేలు గెలిచే పార్టీ అయినా కూటమి అయినా 93 నంబర్ దగ్గర కూడా ఆగుతుంది అని అంటున్నారు. అదే జరిగితే టీడీపీ కచ్చితంగా మిత్రుల మీదనే ఆధారపడుతుంది. సో ఈ విషయం కూడా ఇపుడు జనసేన సహా బీజేపీ లోనూ చర్చగా సాగుతోంది.
ఏపీలో టైట్ ఫైట్ ఉందని దాని వల్ల లాభం కూడా ఉందని కూటమిలో టీడీపీకి సోలోగా మెజారిటీ దక్కకపోతే పంట పండినట్లే అన్నది కూడా ఆ రెండు పార్టీలలోనూ చర్చగా వస్తోంది. సో ఈసారి బీజేపీ జనసేనల తరఫున సీట్లు ఎవరికి దక్కాయో కానీ వారు గెలిస్తే కనుక లక్కీ అని అంటున్నారు. వారికి కోరిన మంత్రి పదవులు కూడా రావచ్చు అని అంటున్నారు. సో ఎన్నడూ లేనంత ఉత్కంఠతో ఈసారి ఎన్నికలు ఏపీలో జరగబోతున్నాయి. ఇది మాత్రం సత్యం.