పవన్ హెలికాప్టర్ టూర్... వైసీపీ వర్సెస్ జనసేన వార్ ...!
ఈ నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు పవన్ గోదావరి జిల్లా టూర్ ప్రోగ్రాం రెడీ అయి ఆఖరు నిముషంలో వాయిదా పడింది.
By: Tupaki Desk | 13 Feb 2024 4:15 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాప్టర్ లో ఏపీ అంతా చుట్టేయాలని అనుకున్నారు. దానికి ఆరంభంగా భీమవరం నుంచే హెలికాప్టర్ ని దించి మరీ గోదావరి రాజకీయాన్ని హుషార్ చేయాలని చూశారు. ఈ నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు పవన్ గోదావరి జిల్లా టూర్ ప్రోగ్రాం రెడీ అయి ఆఖరు నిముషంలో వాయిదా పడింది.
దానికి కారణం పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కి అనుమతించకపోవడమే అని జనసేన ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి ఆరోపించారు. దీని వెనక అధికార యంత్రాంగంపై అధికార పక్షం ఒత్తిళ్లే కారణం అని ఆయన అంటున్నారు. జనసేన అధినేత పవన్ భీమవరం పర్యటన విషయంలో ఆర్ అండ్ బి శాఖ మోకాలడ్డిందని ఆయన విమర్శించారు.
స్థానిక విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలీప్యాడ్ లో పవన్ ప్రయాణించే హెలీకాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారని ఆయన అంటున్నారు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతర పెట్టడం వెనక అధికార పక్షం ఒత్తిళ్ళు ఉన్నట్లు అర్థమవుతోందని ఫైర్ అయ్యారు. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం ఇప్పటికి అనేకసార్లు వినియోగించారని గుర్తు చేశారు.
ఇప్పుడు పవన్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉందని అన్నారు. ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ అండ్ బి అధికారులతో అనుమతుల విషయంలో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఇలా అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవడాన్ని ఖండిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ఈ నెల 14న పవన్ భీమవరం పర్యటనను వాయిదా వేశామని పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తామని వెల్లడించారు.
ఇది జనసేన చేస్తున్న ఆరోపణలు. అధికారుల నుంచి వస్తున్నది వేరేగా ఉంది. అన్ని విషయాలు భద్రతా ఇత్యాది చూసుకునే ఇలా అనుమతిని ఇవ్వడంలేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే జనసేనతో పాటు టీడీపీ అభ్యర్ధులను గెలిపించేందుకు పవన్ పూర్తి స్థాయిలో ప్రచారానికి దిగిపోతున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పవన్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రోజుకు మూడు సభలు. అలాగే మొత్తం 26 జిల్లాలలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తారు. ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు పవన్ జనంలోనే ఉంటారు అని అంటున్నారు.
ఇక పవన్ జనంలోకి వస్తున్న సందర్భంగా యాక్షన్ ప్లాన్ ఈ విధంగా ఉండబోతోంది. ఆయన పార్టీ ముఖ్య నేతలతో ఎక్కడికక్కడ సమావేశం అవుతూ సమీక్షలు నిర్వహిస్తూ బహిరంగ సభలను నిర్వహిస్తారని అంటున్నారు. దానికి ఆదిగా భీమవరంతో మొదలెడతామని అనుకున్నారు. మరి ఆదిలోనే హంస పాదులా ఇలా బ్రేక్ పడింది. దీని వెనక రాజకీయం ఉందని జనసేన అంటోంది. వైసీపీ వైపు చూస్తే అలాంటిది లేదని అంటోంది.
వీటిని పక్కన పెడితే ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని విపక్షాలు నిర్వహించుకోవాల్సి ఉంది. దాని కోసం వారు అనేక మార్గాలను ఎంచుకుంటారు. ఈ రోజులలో హెలికాప్టర్లను కూడా వాడుకోవడం అలవాటు. రా కదలిరా అన్న సభల కోసం టీడీపీ అధినేత హెలికాప్టర్ నే వాడుకున్నారు. ఆయన రోజుకు మూడు సభల వంతున జనవరిలో చాలా జిల్లాలను కవర్ చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో కూడా మరికొన్ని కవర్ చేశారు.
చంద్రబాబు హెలికాప్టర్ టూర్లకు అభ్యంతరం లేనపుడు పవన్ టూర్లకు ఎందుకు అన్న చర్చ వస్తోంది. ఏది ఏమైనా బ్రేకులు వేశారని నిజంగా అనుకుంటే అది మంచి విధానం కాదని అంటున్నారు. ప్రజలే తీర్పరులు. అందువల్ల విపక్ష నేతలు అయినా అధికార పక్ష నేతలు అయినా జనంలో తిరిగేందుకు ఫ్రీ గా ఉండాలి. పవన్ హెలిప్యాడ్ విషయంలో అధికారులు అభ్యంతరం చెప్పినా మరో చోట అయినా స్థలం చూపించాలి. రేపు అదే జరుగుతుంది కూడా. ఇలా చేయడం వల్ల విపక్షానికే ప్లస్ అవుతుంది అదే టైం లో అధికార పక్షం పాత్ర ఉన్నా లేకపోయినా మైనస్ అవుతుంది అని అంటున్నారు.