Begin typing your search above and press return to search.

పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నారని రాత్రికి రాత్రే..!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈసారి ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు

By:  Tupaki Desk   |   4 May 2024 9:29 AM GMT
పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నారని రాత్రికి రాత్రే..!
X

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈసారి ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఆయన ఈసారి పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అక్కడ పవన్‌ తరఫున ఆయన సోదరుడు నాగబాబు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇక జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రోజుకు మూడు సభలతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై వాడివేడి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమి ఏర్పాటుకు కర్మ, కర్త, క్రియ అంతా పవన్‌ కళ్యాణేనన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థుల తరఫున ఆయన ఉధృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నారని రాత్రికి రాత్రే వైసీపీ నేతలు హెలిప్యాడ్‌ ను ధ్వంసం చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మే 5న ఆదివారం పవన్‌ గుంటూరు జిల్లా పొన్నూరులో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆయన పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభను కూడా నిర్వహిస్తుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.

పవన్‌ హెలికాప్టర్‌ లో వస్తుండటంతో హెలిప్యాడ్‌ కోసం అధికారులకు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ పొన్నూరు సభలో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నూరులోని సజ్జా ఫంక్షన్‌ హాల్‌ వద్ద హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ఈ హెలిప్యాడ్‌ ను వాడుకోవాలని అధికారులు కూటమి నేతలకు సూచించారు.

అయితే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వాల్సిన చోట హెలిప్యాడ్‌ ను వైసీపీ నేతలు రాత్రికి రాత్రే ధ్వంసం చేశారు. ఈ ఘటన హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ హెలిప్యాడ్‌ ను తమ ముఖ్యమంత్రి కోసం తాము ఏర్పాటు చేసుకున్నదని.. దీన్ని పవన్‌ కళ్యాణ్‌ దిగడానికి ఎలా ఇస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. తాము ఏర్పాటు చేసిన హెలిఫ్యాడ్‌ను జనసేన నేతలు ఎలా వాడుకుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా పొన్నూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఐలాండ్‌ సెంటర్‌లో ఆదివారం ఉదయం 9 గంటలకు పవన్‌ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అయితే వైసీపీ నేతలు హెలిప్యాడ్‌ ను ధ్వంసం చేయడంతో జనసేన నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హెలిప్యాడ్‌ కు మరో స్థలాన్ని పరిశీలిస్తున్నారు.