అయ్యన్నపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు... సభలో నవ్వులే నవ్వులు!
ఈ సమయంలో అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
By: Tupaki Desk | 22 Jun 2024 1:54 PM GMTఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం తొలిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో... ఈ రోజు సభలో నూతన సభాపతిని అభినందించడం.. అనంతరం ఆయన స్పందించడం జరిగింది! ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అవును... ఏపీ శాసనసభ నూతన స్పీకర్ గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసల జలులు కురిశాయి. అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో తన తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా అయ్యన్న గొప్పతనం గురించి వివరించారు.
ఈ సందర్భంగా... సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్నపాత్రుడు వంటి వ్యక్తి సభాపతిగా ఎన్నిక కావడం తనకెంతో ఆనందంగా ఉందని.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరగడానికి అయ్యన్న అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని పవన్ ప్రశంసించారు. ఇదే సమయంలో... అయ్యన్నపాత్రుడి మాటల్లో వాడి వేడిని పవన్ ప్రస్థావించారు!
ఇందులో భాగంగా... "మీకు కోపం వస్తే రుషికొండను చెక్కినట్లు ప్రత్యర్థులను పదునైన ఉత్తరాంధ్ర యాసతో గుండు కొట్టేస్తారు" అని చెప్పిన పవన్... అయితే తన భాదల్లా ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవడం అని అన్నారు. దీంతో అయ్యన్నతోపాటు సభికులంతా ఒక్కసారిగా నవ్వారు. ఇకపై మాత్రం సభలో ఎవరు తిడుతున్నా దాన్ని అడ్డుకునే బాధ్యత మీచేతుల్లోనే ఉంది అని పవన్ తెలిపారు.
ఈ ఫ్లో కంటిన్యూ చేస్తూ... చిన్నప్పుడు అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ ని చేశామని స్కూల్ డేస్ ని గుర్తు చేసుకున్నారు. దీంతో... ఆయనకు ఇకపై గతంలో మాట్లాడిన స్థాయిలో మాట్లాడే ఆ అవకాశం లేదని గతానుభవాన్ని.. ఎవరైనా మాట్లాడితే వారిని ఆపాల్సిన బాధ్యత మీదే అంటూ భవిష్యత్ కర్తవ్యాన్ని ఒకేసారి గుర్తుచేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో... ఇంతకాలం మీ వాడి, వేడి పలుకులు.. ఘాటైన వాగ్ధాటి చూసిన రాష్ట్ర ప్రజలు.. ఇకపై మీ హుందాతనం చూస్తారని పవన్ ఆకాంక్షించారు. చర్చల వెనకాల దాక్కొన్న సంస్కారహీన భాషలను, భావాలను రకరకాల మాధ్యమాల్లో విరజిమ్ముతున్నారని.. దానిని నియంత్రించడం మీ ఆధ్వర్యంలో, ఇక్కడ నుంచే మొదలు కావాలని పవన్ కల్యాణ్ అన్నారు.
దీంతో... పవన్ కల్యాణ్ చెప్పాలనుకున్న విషయాలను వీలైనంత సూటిగా, స్పష్టంగా అయ్యన్నకు చెప్పేశారని... గతంలో ఎన్నడూ లేనంత హుందాగా సభను నడపేలా చర్యలు తీసుకోవాలని పవన్ చెప్పకనే చెప్పారని అంటున్నారు! ఏది ఏమైనా.. అసెంబ్లీలో పవన్ ప్రసంగం.. స్పీకర్ కి చేసిన సూచనలు మాత్రం వైరల్ అనే చెప్పాలి.